సినీ పరిశ్రమలో సెలబ్రెటీలకు మీడియా, సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే వారికి నష్టం, తీవ్ర ఇబ్బంది కలుగజేస్తుంటుంది. అయితే ప్రతీరోజూ వచ్చే ఆ వార్తలు, పుకార్లపై స్పందిస్తూ అందరితో న్యాయపోరాటాలు చేయలేరు కనుక వారు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు.
కానీ ఒక్కోసారి ఆ పుకార్లు శృతిమించినప్పుడు వారు స్పందిస్తుంటారు. సాయి పల్లవి కూడా ఇబ్బందిపడటంతో ఆమె మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు, పుకార్లు పుట్టిస్తున్నవారికి సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ మెసేజ్ పెట్టారు.
నా గురించి, నా సినిమాల గురించి మీడియాలో నిత్యం ఏవో రాస్తూనే ఉంటారు. కానీ చాలా వరకు వాటిని నేను పట్టించుకోను. కానీ కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు ఇటీవల ఆ హద్దులు దాటి పోస్టులు పెట్టినందున స్పందించాల్సి వస్తోంది. ఇకనైనా అటువంటి తప్పుడు రాతలు మానుకోమని లేకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని వారిని హెచ్చరిస్తున్నాను,” అని సాయి పల్లవి మెసేజ్ పెట్టారు.
ఆమె హిందీలో రామాయణ సినిమాలో సీతమ్మగా నటిస్తున్నారు. శ్రీరాముడుగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఆ సినిమా కోసం సాయి పల్లవి పూర్తిగా మాంసాహారం మానేసి శాఖాహారం మాత్రమే తింటున్నారని ఓ సినీ వెబ్ సైట్ వ్రాసింది. దానికి మరింత మసాలా జోడించి మరికొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియా వార్తలు ప్రచురించాయి.
వాటిపైనే సాయి పల్లవి ఈవిదంగా స్పందించారు. ఎందువల్ల అంటే ఆమె మొదటి నుంచి శాఖాహారి. ఎన్నడూ మాంసాహారం ముట్టనేలేదు కనుక. కానీ వెబ్ సైట్లలో వచ్చిన ఈ కధనాల వలన ఆమె మాంసాహారి అని అందరూ భావించడం సహజం.
బహుశః ఇది ఆమె కుటుంబానికి ఇబ్బందికరంగా మారి ఉండవచ్చు. అందుకే సాయి పల్లవి ఇంత ఘాటుగా హెచ్చరించిన్నట్లు భావించవచ్చు.