అమెరికాలాగ భారత్ దృడంగా వ్యవహరించలేదా?

April 20, 2017


img

అమెరికా , ఆస్ట్రేలియా దేశాలు భారతీయులకు వారి దేశాలలో పని చేసేందుకు వీసాలు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. వారి దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎవరూ తప్పు పట్టలేరు. అయితే ఈ భారత్ కూడా ఇరుగుపొరుగు దేశాలతో అంత దృడంగా, ధైర్యంగా వ్యవహరించగలుగుతోందా? అని ఆలోచిస్తే లేదనే చెప్పుకోవలసివస్తుంది. 

ఉదాహరణకు భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ నుంచి నిత్యం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటునప్పటికీ, నేటికీ దానికి “మోస్ట్ ఫెవర్డ్ నేషన్” హోదాను రద్దు చేయలేకపోతోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో ఆరు పట్టణాలు మావేనని చెపుతూ వాటికి చైనా కొత్త పేర్లు పెట్టినా ఏమి చేయలేని నిస్సహాయస్థితి. భారత్ మార్కెట్లను ముంచెత్తుతున్న “చైనా మాల్” వలన దేశంలో వేలాది పరిశ్రమలు, సంస్థలు మూతపడుతున్నా, ఆ కారణంగా వాటిపై ఆధారపడిన ఉద్యోగులు రోడ్డున పడుతున్నా చైనా మాల్ భారత్ మార్కెట్ల దురాక్రమణను ప్రభుత్వం అడ్డుకొనే సాహసం చేయలేకపోతోంది. 

ఒకవైపు మన పరిశ్రమలను, వ్యాపార సంస్థలను చైనా దెబ్బ తీస్తూనే, ఏటా వేల కోట్లు లాభాలు గడిస్తోంది. భారతీయ సంస్థలకు, పరిశ్రమలకు దక్కవలసిన ఆ లాభాన్ని చైనా తన్నుకుపోవడమే కాకుండా తమ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, పరిమితులు విదించినా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలసి ఉంటుందని బెదిరిస్తోంది కూడా. అయినా ప్రభుత్వం మేల్కొని గట్టిగా జవాబు చెప్పలేకపోతోంది. 

అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు తమ దేశ ప్రజల, సంస్థల ప్రయోజనాలు కాపాడటం కోసం ఇంత కటినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని దృడంగా అమలుచేయగలుగుతున్నప్పుడు, మనకు ఇన్ని విధాలుగా నష్టం జరుగుతున్నా కూడా చైనా, పాకిస్తాన్ లతో దృడంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నాము? 

ఒకప్పుడు భారత్ ఉత్పత్తి రంగంలో స్వయంసంవృద్ది సాధించి, కోట్లాదిమందికి ఉద్యోగాలు కల్పించింది. కానీ ప్రభుత్వాలు దానిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా చైనా దురాక్రమణకు కూడా అవకాశం కల్పించడంతో నేడు పరాయిదేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తోంది. ఎక్కడో ఏడూ సముద్రాల అవతల ఏదో దేశం ఏదో నిర్ణయం తీసుకొంటే ఇక్కడ భారత్ విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. ఏదో దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తితే ఇక్కడ భారత్ లో దాని ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఇది మన స్వయంకృతాపరాధామా కాదా? అందరూ ఆలోచించాలి. ఎవరు ఆలోచించకపోయినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా దీని గురించి ఆలోచించి దేశీయ పరిశ్రమలను, దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. బి ఇండియన్ బై ఇండియన్! 


Related Post