తెలంగాణాలో వేరే పార్టీకి అవకాశం లేదా?

April 20, 2017


img

గత కొన్ని రోజులుగా తెరాస నేతలందరూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధిపదంలో దూసుకుపోతోందని, మరో 10-20 ఏళ్ళ వరకు రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంటుందని ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకొంటున్నారు. రేపు కొంపల్లిలో జరుగబోయే తెరాస ప్లీనరీ సమావేశంలో అందరూ కలిసి కోరస్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ కు జేజేలు పలుకుతూ భజనపాటలు పాడవచ్చు. ఆ మాటకొస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలలో అధికార పార్టీలు ఇదే పాటపాడుకొంటున్నాయి కనుక అందులో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయితే తెరాస నేతల ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ కార్యక్రమంలోనే కొంచెం తేడా కనిపిస్తోంది. 

అదేమంటే రాష్ట్రంలో తెరాసను తప్ప మరే ఇతర పార్టీలను ప్రజలు ఆదరించరని గట్టిగా చెప్పుకోవడం. అందుకు వారు ఒక్కో పార్టీలో ఒక్కో లోపం చూపించి అందుకే తెలంగాణాకు తెరాస తప్ప వేరే నాధుడు లేడని తేల్చి చెప్పేస్తున్నారు. కానీ విచిత్రమేమిటంటే, దక్షిణాది రాష్ట్రాలలో కర్నాటక తరువాత తెలంగాణా రాష్ట్రంలోనే కాంగ్రెస్, భాజపాలకు మంచి పట్టు, విజయావకాశాలు ఉన్నాయని ఆ రెండు పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు తెలంగాణా రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించాయి. రెండేళ్ళ తరువాత జరుగబోయే ఎన్నికల కోసం ఆ రెండు పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించేశాయి. 

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నేడు అదే పని మీద హైదరాబాద్ వస్తున్నారు. త్వరలోనే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అందుకే హైదరాబాద్ రాబోతున్నారు. ఈ మూడు పార్టీలకు అదనంగా ప్రొఫెసర్ కోదండరామ్, గద్దర్ వంటి వారు ఎవరైనా కొత్తపార్టీలతో ప్రజల ముందుకు వస్తే తెరాసకు వారిని కూడా ఎదుర్కోక తప్పదు. కనుక తెరాస నేతలు చెప్పుకొంటున్నట్లు వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగబోవని, తెరాస, కాంగ్రెస్, భాజపాల మద్య గట్టి పోటీ ఉంటుందని స్పష్టం అవుతోంది. 

ఇంకా రాజకీయ సమీకరణాల ప్రభావం, శాసనసభ సీట్లు పెరుగకపోతే మళ్ళీ పార్టీ ఫిరాయింపుల బెడద తెరాసకు ఉండనే ఉంటుంది. కనుక ఎంత గట్టిగా భజన పాటలు పాడుకొన్నా పరువాలేదు కానీ రాష్ట్రంలో వేరే ఏ పార్టీని ప్రజలు ఆదరించరనే భ్రమలో పడకుండా ఉంటే మంచిది.  


Related Post