కేంద్రంలో భాజపా అధికారంలో ఉండగా అందునా చాలా శక్తివంతుడైన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు భాజపా నేతలను ఎవరూ వేలెత్తి చూపే సాహసం చేయలేరని అందరూ భావించడం సహజమే. కానీ కేంద్రమంత్రి ఉమాభారతితో సహా పార్టీలో కురువృద్ధులు వంటి లాల్ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్ జోషితో సహా 13మందిపై బాబ్రీ విద్వంసం కేసులో పునర్విచారణకు సుప్రీంకోర్టు నేడు అనుమతించడం దేశ రాజకీయాలలో చాలా సంచలనమైన విషయమే. ఈ కేసులో కుట్రదారులు అందరినీ విచారించి రెండేళ్ళలోగా కేసు ముగించాలని, అందుకోసం రోజువారిగా కేసుపై విచారణ చేపట్టాలని లక్నో నాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా, ఆర్.ఎస్.ఎస్. నేతలు, కేంద్రమంత్రులు గానీ ఎవరూ ఇంతవరకు మాట్లాడలేదు. కానీ బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు. “లాల్ కృష్ణ అద్వానీకి రాష్ట్రపతి పదవి దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ తన చేతిలో ఉన్న సిబిఐను పరిగెత్తించి ఈ కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు,” అని అన్నారు. లాలూ ఇంకా చాలా అన్నారు. అవన్నీ అప్రస్తుతం.
నిజమే..శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు ప్రధాని మోడీకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా సిబిఐ అధికారులు భాజపాలోని కురువృద్ధులను, అయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి ఉమాభారతిని బాబ్రీ విద్వంసం కేసులో పునర్విచారించాలని కోరారంటే నమ్మశక్యంగా లేదు. కనుక లాలూ ప్రసాద్ ఆరోపణలు నిజమేనని నమ్మవలసి ఉంటుంది.
అయితే అద్వానీని రాష్ట్రపతి రేసులో నుంచి తప్పించడానికి మోడీ ఇంత కష్టపడాలా? పైగా అద్వానీ స్వయంగా తాను ఆ రేసులో లేనని ప్రకటించిన తరువాత మోడీకి కుట్ర పన్నవలసిన పనేమిటి? పార్టీలో సీనియర్లపై, తన మంత్రివర్గంలో మంత్రిపై మోడీ స్వయంగా ఎందుకు బురదజల్లుకొంటారు? వారిని కుట్రదారులుగా నిరూపించి జైలుకి పంపించి తన పార్టీకి, ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగించుకొంటారా? దాని వలన మోడీకి ఒరిగేదేమిటి? అని ఆలోచిస్తే లాలూ ఆరోపణలు ఎంత అసంబద్దంగా ఉన్నాయో అర్ధం అవుతాయి.
అయితే ఈ కేసును మోడీ ఎందుకు ముందుకు సాగనిచ్చారు? అంటే దానికి ఉమాభారతి చెప్పిన మాటను తప్పక వినవలసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ,”నేను తప్పు చేశానని బాధపడటం లేదు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం నేను నా ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశాను. దాని కోసం జైలుకి వెళ్ళడానికైనా, ఉరి శిక్షకైనా సిద్దమే. ఆనాడు జరిగింది కుట్ర కాదు. అంతా బహిరంగంగానే జరిగింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఖాయం. దానిని ఏ శక్తి అడ్డుకోలేదు. దాని కోసం ఎంతటి త్యాగాలకైనా మేము సిద్దమే,” అని అన్నారు.
ఈ కేసు అకస్మాత్తుగా ఎందుకు తెరపైకి వచ్చిందో చూచాయగా అర్ధం అవుతుంది. ఈ కేసులో భాజపా సీనియర్ నేతలను విచారించడం మొదలుపెడితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే హిందువులలో భావోద్వేగాలు చెలరేగుతాయని వేరేగా చెప్పనవసరం లేదు.
ఈ కేసును ముగించడానికి సుప్రీంకోర్టు విదించిన గడువు రెండేళ్ళు. అంటే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ కేసు కారణంగా దేశంలో మళ్ళీ అయోధ్య రామ మందిరం వేడి పెరుగుతుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కోబోతున్న వారందరూ ఆవేడిని ఎంత కావాలనుకొంటే అంత పెంచగల సమర్దులే. అగ్నికి వాయువులాగ తోడ్పడేందుకు ఆదిత్యనాథ్ యోగిని భాజపా యూపి ముఖ్యమంత్రిగా నియమించుకొంది. కనుక ఈ కేసు విచారణ జరుగుతున్న కొద్దీ హిందువులలోఅప్రయత్నంగానే భావోద్వేగాలు పెరుగుతాయి. వాటిని భాజపా నేతలు అందరూ కలిసి వచ్చే ఎన్నికల నాటికి పతాకస్థాయికి తీసుకుపోవడం పెద్ద కష్టమేమి కాదు.
వారి ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో భాజపా అఖండ మెజార్టీతో ఎన్నికలలో విజయం సాధించవచ్చు. చివారఖరుకు సాంకేతిక కారణాలు చూపి కోర్టు వారిపై కేసు కొట్టివేయవచ్చు. ఈ కేసులో కుట్రదారులుగా పేర్కొనబడినవారందరూ అప్పుడు హీరోలుగా ఆవిర్భవించవచ్చు. ఇదీ.. బహుశః ఈ కేసు తెరపైకి తీసుకురావడం వెనుక కారణం అయ్యుండవచ్చు. ఈ ఊహాగానం నిజామా కాదా..అనేది రానున్న రోజులలో అందరూ స్వయంగా కళ్ళతో చూడవచ్చు.