ఎన్నికల హామీలో జాప్యం కూడా వ్యూహత్మకమేనా?

April 19, 2017


img

రాష్ట్రంలో రైతులు అందరికీ వచ్చే ఏడాది నుంచి ఉచితంగా ఎరువులు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. అయితే అదేదో ఈ ఏడాది నుంచి అమలుచేయకుండా వచ్చే ఏడాది నుంచి ఎందుకు చేయాలనుకొంటున్నారు? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కదా? అని కాంగ్రెస్ నేతల ప్రశ్న ఆలోచించవలసిన విషయమే. అప్పటికి ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి మాత్రమే ఉంటుంది కనుక అప్పుడు ఎరువులు సరఫరా చేయడం మొదలుపెడితే రైతులు కూడా ఫ్లాట్ అయిపోయి తెరాసకే ఓట్లు వేసేస్తారని కేసీఆర్ కలలు కంటున్నారని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఒకవేళ కేసీఆర్ అదే ఉద్దేశ్యంతో దీనికి వచ్చే ఏడాది ముహూర్తం పెట్టుకొని ఉన్నా ఆశ్చర్యం లేదు.  

కనుక ఈ ఫార్ములానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి ఇతర హామీలకు కూడా అన్వయించి చూసిన్నట్లయితే, ఇంతకాలం తెరాస సర్కార్ ఊరకే జాప్యం చేయలేదనే అనుమానం కలుగుతుంది.  మూడేళ్ళలో కనీసం 10,000 ఇళ్ళు కట్టించి ఇవ్వలేదు. కానీ మిగిలిన ఈ రెండేళ్ళలో ఏకంగా 2.60 లక్షల ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి తెరాస సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండటం చూస్తుంటే ఆ అనుమానం బలపడుతోంది. 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ ఇంత కాలం ఆర్ధిక, సాంకేతిక, చట్టపరమైన, పరిపాలనపరమైన కారణాలతో జాప్యం చేసి, ఇప్పుడు వాటిని వేగవంతం చేయడం చాలా గొప్ప రాజకీయ వ్యూహమని చెప్పకతప్పదు. ఇంతకాలం ఆయన ఎన్నికల హామీలను అమలుచేయలేదని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా పట్టించుకోకపోవడానికి ఇదే కారణమేమో? 

ఎన్నికల హామీలను అమలు చేయనందుకు ప్రతిపక్షాలు తెరాస సర్కార్ విమర్శిస్తూ ఏదో కొద్దిగా రాజకీయ మైలేజి పొందాలని ఆరాటపడుతుంటే, కేసీఆర్ మాత్రం దూరదృష్టితో ఆలోచించి వచ్చే ఎన్నికల కోసం వాటిని దాచి పెట్టుకొని ఉండవచ్చు. ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది కనుక జమ్మిచెట్టు మీద దాచి ఉంచిన ఈ అస్త్రశస్త్రాలనన్నిటినీ ఒకటొకటిగా బయటకు తీసి ఇప్పుడు ప్రయోగిస్తున్నట్లున్నారు. 

సరిగ్గా వచ్చే ఎన్నికలకు ముందు మిషన్ భగీరధ, కాకతీయలు పూర్తి చేసి రైతులందరికీ త్రాగు నీరు, సాగు నీరు అందించి, ఉచితంగా ఎరువులు పంచిపెట్టి, 2.60 లక్షల ఇళ్ళు పూర్తి చేసి ప్రజల చేతిలో పెడితే ఫలితం ఏవిధంగా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. తెరాస సర్కార్ ఎన్నికల హామీలు అమలుచేయడంలేదని ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు, విమర్శలు, ఆరోపణలు, వాటి కోసం అవి చేసిన యుద్దాలు...అన్నీ గాలికి కొట్టుకొనిపోతాయి. హామీలను అమలుచేసి చూపించిన ‘బక్క మనిషి’ కేసీఆర్ మళ్ళీ ఎన్నికలలో విజయం సాధిస్తారు. ఈ ఊహ నిజామా కాదా అనేది వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది.


Related Post