తెరాస-భాజపాల మద్య మ్యాచ్ ఫిక్సింగ్?

April 19, 2017


img

‘తాంబూలాలు ఇచ్చేశాము ఇక తన్నుకు చావండి’ అన్నట్లుగా తెరాస సర్కార్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించేందుకు శాసనసభలో బీసి-ఈ బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో తెరాస-భాజపాల మద్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఒక కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ బిల్లు కేంద్రం ఆమోదం పొందే అవకాశం లేదు కనుక దాని వలన ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోవచ్చు. కానీ దాని పేరు చెప్పుకొని ఆ రెండు పార్టీలు రాజకీయ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. 

ముస్లింల సంక్షేమం కోసం బిల్లు పెట్టామని ముస్లిం ఓటు బ్యాంకును తెరాస, ఆ బిల్లును గట్టిగా వ్యతిరేకించినందుకు హిందూ ఓటు బ్యాంకును భాజపా కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ తెరాసకు నిజంగా ముస్లింలపై అంత ప్రేమ ఉండి ఉంటే, ఈ పని మూడేళ్ళ క్రితమే ఎందుకు చేయలేదు? ఒకవేళ అప్పుడే వారికి రిజర్వేషన్లు కల్పించి ఉంటే ఈ మూడేళ్ళలో వారికి అనేక ఉద్యోగాలు వచ్చేవి కదా? అని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలలో దీనిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం పక్కనబెట్టి, ఇప్పుడు బయటకు తీసి దాని నుంచి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ బిల్లుని కేంద్రం చేత ఆమోదింపజేసుకొనేందుకు దానితో కొట్లాడుతానని కేసీఆర్ ప్రకటించడం అందుకేనని కాంగ్రెస్ వాదన. ముస్లిం ప్రజలను ఆకర్షించి వారి ఓట్లు దండుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పెద్ద పధకమే పన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మద్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక ఈ అంశంపై ఎంత రాద్దాంతం జరిగితే అంత తెరాస, భాజపాలకే ప్రయోజనం కలగడం తధ్యం. 

ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఈ విషయంలో ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నప్పటికీ, దీనితో అవి పూర్తి లబ్దిపొంది, వచ్చే ఎన్నికల తరువాత రెండు పార్టీలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. అందుకే వాటి మద్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. 


Related Post