భారత్ లో చైనా వస్తువులు లేని ఇల్లు, కార్యాలయం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక మొబైల్ ఫోన్లదేముంది? దాదాపు అన్నీ అక్కడే తయారై వస్తున్నాయి. అతి తక్కువ ధరకే మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్లు వస్తుండటంతో, రిలయన్స్ వంటి అతిపెద్ద సంస్థలు కూడా చైనా సెట్లనే తమ వినియోగదారులకి అందజేస్తున్నాయి.
ఒకవైపు మోడీ ప్రభుత్వం “మేక్ ఇన్ ఇండియా” పధకంలో భాగంగా భారత్ లో ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, కారుచవకగా దొరికే ఈ ‘చైనా మాల్’ తో పోటీ పడలేకపోతున్న భారతీయ సంస్థలు తమను ఆదుకోమని చేస్తున్న విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. భారతీయ మొబైల్ ఇండస్ట్రీని నిలబెట్టాలంటే ముందు చైనా మాల్ కు అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. దాని కోసం వాటిపై అదనపు పన్నులు విదించడం లేదా ఆంక్షలు విదించవలసి ఉంటుంది. అయితే కేంద్రప్రభుత్వం ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. కానీ ఈలోగానే చైనా ప్రభుత్వ అధికారిక మీడియాలో భారత్ కు బెదిరింపులు మొదలైపోయాయి.
“ఒకవేళ భారత్ మొబైల్ సంస్థల ఒత్తిళ్ళకు లొంగి భారత్ ప్రభుత్వం మా మొబైల్ తయారీ కంపెనీలకు నష్టం కలిగించే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా దానికి మా నుంచి కూడా బలమైన ప్రతిక్రియ ఉంటుంది. కొన్ని మొబైల్ కంపెనీల కోసం ద్వైపాక్షిక సంబంధాలను భారత్ పణంగా పెడుతుందనుకోము. భారత్ ఇప్పుడు చైనాతో సహా ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. కనుక వాటి విఘాతం కలిగించే నిర్ణయం తీసుకోదని ఆశిస్తున్నాము,” అని చైనా అధికారిక మీడియాలో కధనాలు ప్రచురించింది.
దీనిని చైనా అధికారిక సమాచారంగా స్వీకరించలేనప్పటికీ, అందులో వ్రాసింది చైనా ప్రభుత్వం అభిప్రాయాలకు అద్దం పడుతున్నవే కనుక వాటిని హెచ్చరికలుగానే భావించవలసి ఉంటుంది.
అంటే భారత్ తప్పనిసరిగా చైనా వస్తువులనే కొనాలి. వాటి దిగుమతిపై ఎటువంటి ఆంక్షలు విదించకూడదు. విదిస్తే పెట్టుబడులు పెట్టడం నిలిపివేసి ప్రతీకార చర్యలు కూడా చేపడతాము,” అని హెచ్చరిస్తోందన్న మాట!
చైనా మాల్ చాప క్రింద నీరులా అన్ని రంగాలలో పరుచుకుపోయుంది. అంబానీ మొదలు సామాన్యుడు వరకు అందరూ చైనా మాల్ చవకగా వస్తుందని చూస్తున్నారే తప్ప చైనా మన దేశంలో అన్ని రంగాలను చాలా ఘోరంగా దెబ్బ తీస్తోందని, దాని వలన అనేక చిన్నా, పెద్ద సంస్థలు నష్టాలలో కూరుకుపోయి మూతపడుతున్నాయని గుర్తించడం లేదు.
ఒక పరిశ్రమ మూతపడితే కొన్ని డజన్లు లేదా కొన్ని వందల మంది ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారి కుటుంభాలు రోడ్డున పడతాయి. అంటే మన ఆర్ధిక, పారిశ్రామిక వ్యవస్థలానే కాకుండా సామాజిక, కుటుంబ వ్యవస్థలను కూడా చైనా మాల్ దెబ్బ తీస్తోందని స్పష్టం అవుతోంది. అయితేచైనా బెదిరింపులకు భయపడి ప్రభుత్వం చైనా మాల్ దిగుమతిని నిషేదించకపోవచ్చు. కనుక దీనికి ఏకైక పరిష్కారం భారత్ పై నిజంగా అభిమానం ఉన్న ప్రతీ భారతీయుడు చైనా మాల్ కొనడం మానివేయడమే!
చైనా మాల్ తో దొరికే కొద్దిపాటి లాభం కంటే మన దేశప్రయోజనాలే ముఖ్యం అనుకొంటే ఎవరూ చైనా మాల్ కొనరు. దీని కోసం ప్రభుత్వాలు కృషి చేయడం కంటే నేతలు, సినీ తారలు, క్రికెట్ తదితర క్రీడాకారులు చైనా మాల్ వాడవద్దని విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ప్రజలలో కూడా మార్పు వస్తుంది. చేనేత వస్త్రాలు ధరించమని కేటిఆర్, సమంత, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో అందరూ చూస్తున్నారు.
నోట్ల రద్దుతో స్వయంసంవృద్ధి సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. కానీ నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం కోసం చైనా నుంచి లక్షల కొద్దీ స్వైపింగ్ మెషిన్లను రప్పించడం విశేషం. అలాగే మన ఆంజనేయ స్వామి, అంబేద్కర్ విగ్రహాలను కూడా చైనాలో తయారుచేయించుకోవాలనే ప్రభుత్వ ఆలోచన విస్మయం కలిగిస్తుంది. కనుక ప్రభుత్వాల ఆలోచన తీరు కూడా మారవలసి ఉంది. ముందు మనామ్ చైనా వస్తువుల మోజును వదులుకొంటే తప్ప మన దేశాన్ని చైనామాల్ బారి నుంచి ఎవరూ కాపాడలేరని అందరూ గ్రహించాలి.