సూట్ కేసు కంపెనీలపై మోడీ యుద్దం

April 18, 2017


img

మన దేశంలో ఒకటీ రెండూ వందలూ కాదు..వేలు కాదు... 4.4 లక్షల సూట్ కేస్ కంపెనీలున్నాయి. అవన్నీ బడాబాబుల అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన దానిని దాచుకొనేందుకు, ఆవిధంగా పోగుపడుతున్న నల్లదనాన్ని మళ్ళీ తెల్లగా మార్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుంటాయి. మన రాజకీయనేతలకు, నల్లకుభేరులకు మద్య బలమైన అక్రమసంబంధాలు కలిగి ఉన్నందున, వాటిని అడ్డుపెట్టుకొని అనేక దశాబ్దాలుగా దేశ సంపదని దోచుకుతింటున్నా ఏ ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేయలేకపోయింది. అందుకే నేటికీ అవి నిరాటకంగా పనిచేస్తున్నాయి. 

గత ఏడాది నోట్ల రద్దు తరువాత వాటి ద్వారానే నల్లదనం ప్రవహించి తెల్లగా మారిన సంగతి గుర్తించిన కేంద్రప్రభుత్వం, వాటిపై కొరడా జళిపించింది. దేశంలో మొత్తం 14.6 లక్షల కంపెనీలు ఉండగా వాటిలో 10.2 లక్షల కంపెనీలు మాత్రమే నిజంగా వ్యాపారం చేస్తూ చట్టబద్దంగా ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 4.4 లక్షల కంపెనీలు ఎటువంటి వ్యాపారలావాదేవీలు చేయకపోయినా, మార్కెట్లో ప్రీమియం షేర్లు జారీ చేస్తుండటం, విక్రయిస్తుండటం, దేశవిదేశాలకు నగదు బదలాయింపులు చేస్తున్నట్లు గుర్తించింది.

 వాటి గుట్టు బయటపెట్టేందుకు, మార్చి నెలాఖరులోగా ఆదాయపన్ను వివరాలను సమర్పించాలని ఆ 4.4 లక్షల కంపెనీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపించింది. ఒకవేళ ఆ వివరాలు సమర్పించకపోతే ఆ కంపెనీల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా, వాటి ఆర్ధిక లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ, ఈడిలు విచారణ మొదలుపెట్టడానికి సిద్దంగా ఉన్నాయి. 

ఇకపై వాటిని నిద్రాణ స్థితిలో ఎందుకు ఉంచవలసి వచ్చిందో, వాటితో సదరు మాతృ సంస్థ ఎటువంటి ఆర్ధిక, వ్యాపారబందం కలిగి ఉందో, వాటితో ఎటువంటి వ్యాపారాలు చేయదలచుకొందో వంటి వివరాలను అన్నిటినీ సమర్పించి, వాటిని నిద్రాణస్థితిలో ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి పొందడం తప్పనిసరి చేసింది మోడీ ప్రభుత్వం. సూట్ కేసు కంపెనీలుగా గుర్తించిన 4.4 లక్షల కంపెనీలలో ఇంతవరకు కేవలం 126 మాత్రమే ప్రభుత్వం నుంచి అధికారికంగా “నిద్రాణ ముద్ర” తీసుకొన్నాయి. మిగిలినవి ఇంకా అలాగే ఉన్నాయి. 

ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందడంతో ఆ సూట్ కేస్ కంపెనీల మాతృసంస్థలు లేదా వాటి యజమానులు ఏమి చేయాలో తెలియక తల పట్టుకొంటున్నారిప్పుడు. తాజా సమాచారం ప్రకారం వాటిలో కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఆదాయవివరాలను సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను సమర్పించేందుకు కేంద్రప్రభుత్వం వాటికి మరొక 30 రోజులు గడువు ఇచ్చింది. అప్పటికీ అవి స్పందించకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసి, వాటిపై సంబంధిత శాఖలన్నీ ముప్పేటదాడి చేయడానికి సిద్దం అవుతున్నాయి. అంతే కాదు.. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సదరు సూట్ కేసు కంపెనీలు..వాటి మాతృసంస్థలు లేదా యజమానుల పేర్లను ప్రజలకు కూడా తెలియజేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అటువంటి సూట్ కేసు కంపెనీ యజమానులున్న సంగతి తెలిసిందే. సూట్ కేసు కంపెనీలపై మొదలుపెట్టిన ఈ యుద్ధంలో మోడీ ప్రభుత్వం విజయవంతం అవ్వాలని అందరం కోరుకొందాము.


Related Post