సింగరేణి సమస్య తీరేదెలా?

April 18, 2017


img

సింగరేణిలో కార్మికులు అందరికీ గంపగుట్టగా వారసత్వ ఉద్యోగాల వెసులుబాటు కల్పించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు నిన్న తేల్చి చెప్పడంతో సింగరేణిలో కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. వారసత్వ ఉద్యోగాల గురించి తెరాస సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగానే వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలనుకొన్న కార్మికులకు ఇప్పుడు ఆ దారి మూసుకుపోవడంతో వారు ఇంకా నిరాశ చెందారు. అయితే అనారోగ్యకారణాలతో పదవీ విరమణ చేయాలనుకొనేవారికి సుప్రీంకోర్టు కూడా మినహాయింపు ఇచ్చింది కనుక వారు తమ ఉద్యోగాలను తమ పిల్లలకు ఇచ్చుకోవచ్చు. కానీ మిగిలినవారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం వెతకవలసి ఉంది. 

కార్మికులు అందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెడితే ఇక సింగరేణిలో బయటవారికి ఉద్యోగాలు దొరకవు. అదీగాక సింగరేణిలో దీనిని అనుమతిస్తే దేశంలో ఇతర ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కూడా తమకూ వారసత్వ ఉద్యోగావకావకాశాలు కల్పించాలని పట్టుబడితే ఊహించని సమస్యలు పుట్టుకొస్తాయి. కనుకనే హైకోర్టు, సుప్రీంకోర్టు వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకించాయని చెప్పవచ్చు.   

కనుక సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి 50:50 నిష్పత్తిలో కొత్త నియామకాలు, వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించవచ్చు లేదా కార్మికులకు, నిరుద్యోగులకు నష్టం కలగని విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాతిపదికన వారసత్వ ఉద్యోగాల వెసులుబాటు కల్పించవచ్చు. బొగ్గు గనులలో ఉద్యోగాలంటే ఏసీ రూముల్లో కూర్చొని చేసే గొప్ప ఉద్యోగాలు కాదు. కార్మికులు నిత్యం తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ పని చేస్తుంటారు. కనుక తప్పనిసరిగా వారి కష్టానికి, త్యాగానికి గుర్తింపు, తగిన ప్రతిఫలం దక్కాలి. వారసత్వ ఉద్యోగాలకు న్యాయస్థానాలు ‘నో’ చెప్పాయి కనుక ఇక ఏమీ చేయలేమని ప్రభుత్వం చేతులు ఎత్తేయకుండా వారికి న్యాయం చేయాలి. సింగరేణి కార్మికసంఘాలన్నీ పార్టీలకు అతీతంగా దీని కోసం కలిసికట్టుగా పనిచేసి ఈ సమస్యను పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించాలి. అలాకాక దీనిపై రాజకీయాలు చేసుకొంటే చివరికి తామే నష్టపోతామని గ్రహించాలి.  


Related Post