పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస సర్కార్ మా ఉచిత ఎరువుల పంపిణీ పధకాన్ని కాపీ కొడితే కొట్టింది. దాని వలన రైతులకు మేలు కలుగుతుందంటే మాకు సంతోషమే. వచ్చే ఏడాది మే నుంచి రాష్ట్రంలో రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ రైతుల పట్ల కేసీఆర్ కు నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో ఈ ఏడాది మే నెల నుంచే అమలుచేయవచ్చు కదా? ఎలాగు లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా? దానిలో నుంచి కొంత తీసి రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామంటే మేము మద్దతు ఇస్తాము” అని అన్నారు.
“అలాగే కంది, వరి రైతులకు కర్నాటక, మిర్చి రైతులకు ఆంధ్రా ప్రభుత్వం బోనస్ చెల్లిస్తున్నాయి. తెరాస సర్కార్ కూడా ఆవిధంగా బోనస్ చెల్లించి మన రైతులను ఆదుకోవచ్చు కదా? అని మేము అడిగితే ఆలోచిస్తామని కేసీఆర్ సమాధానం చెపుతారు. రైతుల కోసం తమ ప్రభుత్వం చాలా చేస్తోందని గొప్పలు చెప్పుకొనే కేసీఆర్ రైతులకు వెంటనే ఎరువులు, బోనస్ అందించి ఆదుకోకుండా మీనమేషాలు లెక్కించడాన్ని ఏమనుకోవాలి?” అని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
“ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలుచేయనప్పటికీ ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తూ అందరినీ మభ్యపెడుతుంటారు. అయినా రైతులను తన ఇంటికి పిలిపించుకొని వారి చేత జేజేలు పలికించుకొంటారు. ఆయన ఇంటికి వచ్చే రైతులు తాము ఎదుర్కొంటున్న ఒక్క సమస్య గురించి కూడా అక్కడ ప్రస్తావించకుండా, ఆయన చెప్పే ప్రతీ మాటకు చప్పట్లు కొడుతూ జేజేలు పలుకుతుంటారు. ఇక ఎక్కడికక్కడ ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు సరేసరి. కేసీఆర్ మరీ ఇంతగా ప్రచారం చేసుకోవాలా? ఈ విషయంలో ఆయన గోబెల్స్ ను మించిపోయారనిపిస్తుంది” అని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.
“ఇప్పుడు ముస్లింలకు, గిరిజనులకు అదనంగా రిజర్వేషన్స్ కల్పిస్తామని చెపుతూ బిల్లు పెట్టారు. అది ఎప్పటికైనా అమలు చేయగలరా? అంటే అనుమానమే. ఆ పేరు చెప్పుకొని ముస్లిం ఓట్లకు గాలం వేసేందుకే దానిని ఇప్పుడు తీసుకువచ్చారు. లేకుంటే మూడేళ్ళ క్రితమే ప్రయత్నించేవారు కదా?” అని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు.
ఆయన వాదనలు, విమర్శలు పక్కనబెడితే, వాటిలో ఒక మంచి సూచన కనిపిస్తుంది. రైతులకు వచ్చే ఏడాది నుంచి ఇవ్వలనుకొన్న ఉచిత ఎరువులను ఈ ఏడాది నుంచే ఇవ్వడం, రైతులకు పంటలపై బోనస్ ప్రకటించడం. వీటిని తక్షణం అమలుచేస్తే రైతులకు చాలా మేలు కలుగుతుంది కదా!