ఒక్కోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొనే వివాదస్పద నిర్ణయాలే బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలకు బలమైన టానిక్ లాగ అందుతుంటుంది. ఈ మూడేళ్ళలో ఆయన అనేకసార్లు ప్రతిపక్షాలు మళ్ళీ బలం పుంజుకోవడానికి అటువంటి అవకాశాలు కల్పించారు. ఇందిరాపార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లకు తరలించాలనే నిర్ణయం కూడా అటువంటిదే.
నిజానికి అక్కడ ధర్నా చౌక్ కొనసాగించినా తెరాస సర్కార్ ఎటువంటి నష్టం ఉండదు. నగర శివార్లకు తరలించినంత మాత్రాన్న ఆందోళనలు నిలిచిపోవు. కానీ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ గళం వినిపించకూడదని, వినిపించదలచుకొన్నా వారు తన కంటికి కనబడనంత దూరంలో ఉండాలని కేసీఆర్ కోరుకోవడమే విచిత్రం.
ఉద్యమకారుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత నియంతృత్వ పోకడలు సంతరించుకోవడం మేధావులను సైతం చాలా ఆశ్చర్యపరుస్తోంది. ధర్నా చౌక్ విషయంలో ఆయన నిర్ణయాన్ని చుక్కా రామయ్య, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి మేధావులు సైతం బహిరంగంగానే నిరసిస్తున్నారు. అయినా ఈ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గకపోవడంతో ఇంకా విచిత్రం.
ధర్నా చౌక్ తరలింపుని నిరసిస్తూ నేడు టీ-కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగడంతో అక్కడ చాలా సేపు బారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు రంగంలో దిగి వారిని అరెస్ట్ చేసి తరలించడం, అనంతరం కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ విమర్శలు గుప్పించడం అంతా రోటీన్ గా జరిగిపోయింది.
ఒకవేళ ధర్నా చౌక్ తరలించకపోయుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశమే ఉండేది కాదు కదా? కానీ కేసీఆర్ ధర్నా చౌక్ ను తరలించడంతో ఆయన ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రజలకు చెప్పగలిగారు. వారు చెపుతున్నది ప్రత్యక్షంగా అందరి కళ్ళకు కనబడుతున్నదే కనుక ప్రజలలో తెరాస సర్కార్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ కి ఈ అవకాశం కేసీఆర్ స్వయంగా కల్పించారు కనుక దీని వలన తన ప్రభుత్వ ప్రతిష్ట ఇంకా దెబ్బతినకుండా ఆయనే తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంది.