హరీష్ రావుతో అంతా ఓకె: కేటిఆర్

April 17, 2017


img

కొన్ని రోజుల క్రితం మంత్రి హరీష్ రావు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “కేటిఆర్ తో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఒకవేళ కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయదలిస్తే నేను ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కేసీఆర్ ఏ భాద్యత అప్పగిస్తే అది చేసుకుపోవడమే తప్ప వేరే ఆలోచించను,” అని చెప్పారు. 

కేసీఆర్ క్యాబినెట్ లో చాలా మంది మంత్రులు ఉన్నప్పటికీ కేవలం హరీష్ రావు, కేటిఆర్ లు మాత్రమే తరచూ ఈ ప్రశ్నను ఎదుర్కోవలసిరావడమే వారిమద్య భేధాభిప్రాయాలు ఉన్నాయనే అనుమానం కలుగజేస్తోంది. ప్రతీసారి వాటిని వారు గట్టిగా ఖండిస్తుంటారు అయినప్పటికీ మీడియా వారిని ఈ ప్రశ్న అడగడం మానదు. 

తాజాగా కేటిఆర్ మళ్ళీ ఇదే ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి ఆయన జవాబిస్తూ, “హరీష్ రావు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు తప్పేమీ కనబడలేదు. రాజకీయాలలో ఉన్నవారు ఏదో ఒక సమయంలో సభలలో పాల్గొనడం, వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడటం సర్వసాధారణమైన విషయమే. కనుక నేను మంత్రి పదవి చేపట్టడం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం తప్పేమీ కాదు. కానీ నాకు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక లేదు. అయినా రాజకీయాలలో 64 ఏళ్ళ వయసు అంటే మరీ పెద్ద వయసేమీ కాదు కనుక మరో 10 ఏళ్ళ పాటు కేసీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన తరువాత ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆలోచించడం అనవసరం. ఇక హరీష్ రావుతో నాకు చక్కటి అవగాహన, మంచి అనుబందమే ఉంది. మా మద్య ఎటువంటి విభేదాలు లేవు,” అని కేటిఆర్ మీడియాతో అన్నారు. 


Related Post