ముస్లిం రిజర్వేషన్ బిల్లుపై శాసనసభలో నిన్న చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఉపనేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక సవాలు విసిరారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్ళు అందించలేకపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడగమని కేసీఆర్ పదేపదే చెపుతుంటారు. అలాగే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గట్టిగా వాదిస్తున్న కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు అటువంటి శపధమే చేయగలరా? ఒకవేళ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడగమని చెప్పగలరా? అని నిలదీశారు.
నిజానికి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడమనేది తన చేతిలో లేదనే సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అంగీకరించారు. దీనికోసం కేంద్రంతో కోట్లాడి ఒత్తిడి తెస్తామని, అప్పటికీ లొంగకుంటే న్యాయపోరాటం చేస్తామని చెప్పినప్పుడే ఆ సంగతి స్పష్టం అయ్యింది. కనుక ఈ సవాలుని స్వీకరించడం సాధ్యం కాదనే సంగతి జీవన్ రెడ్డితో సహా అందరికీ తెలుసు.