నిన్న జరిగిన శాసనసభ ఒక్కరోజు ప్రత్యేక సమావేశానికి తెదేపా ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను అనుమతించిన తెరాస సర్కార్ తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అనుమతించకపోవడం శోచనీయం. వారిరువురిపై బడ్జెట్ సమావేశాల వరకు మాత్రమే సస్పెన్షన్ విదించారు కనుక అప్పుడు వారిని సభలోకి అనుమతించకపోయినా ఎవరూ తెరాస సర్కార్ ను వేలెత్తి చూపలేరు. కానీ నిన్న మూడు బిల్లుల ఆమోదం కోసం ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరిచినప్పుడు దానికి కూడా వారిరువురినీ ఎందుకు అనుమతించలేదో తెలియదు. కాంగ్రెస్, భాజపా, మజ్లీస్ పార్టీల సభ్యులు ప్రభుత్వతీరుని ఘాటుగా విమర్శిస్తున్నప్పటికీ వారిని సమావేశాలకు అనుమతిస్తునే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను మాత్రమే ఎందుకు అనుమతించడం లేదు? అంటే రాజకీయ కక్షతోనే అనిపిస్తుంది.
తమను శాసనసభలోకి అనుమతించనందుకు వారిరువురు ఇతర తెదేపా నేతలతో కలిసి బయట అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు కూర్చొంటే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఎప్పుడూ తెరాస సర్కార్ పనితీరుని తప్పుపడుతూ, అవినీతిని ఎత్తిచూపుతూ ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తునందున తెరాస నేతలకు ఆయనపై ఆగ్రహం కలుగవచ్చు. కానీ వారిరువురినీ ఏదో ఒక సాకుతో సభ నుంచి పదేపదే సస్పెండ్ చేస్తుండటం వలన వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల ప్రజల సమస్యల గురించి సభలో ప్రస్తావించే అవకాశం లేకుండాపోతోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్లుంది.
శాసనసభ్యులైన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను ఏదో వంకతో శాసనసభలోకి రాకుండా చేయడానికి శాసనసభ తెరాస స్వంత ఆస్తి కాదు. యావత్ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధుల సభ అది. అధికారంలో ఉన్నవారికి ఆ సభ సమావేశాలలో పాల్గొనేందుకు ఎంత హక్కు కలిగి ఉంటారో, ప్రతిపక్ష సభ్యులు కూడా అంతే హక్కు కలిగిఉంటారు. కానీ తమకు నచ్చనివారిని సభలోకి అనుమతించకపోవడం అంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ప్రజలను అవమానిస్తున్నట్లే..వారి హక్కులకు భంగం కలిగిస్తున్నట్లే అవుతుంది. కనుక వారిపై ఈవిధంగా తెరాస సర్కార్ వివక్ష చూపడం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లు అవుతోందని గ్రహిస్తే మంచిది.