ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్ రెడ్డి?

April 17, 2017


img

తెలంగాణా రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన తెదేపా ఉనికిని ఇంకా గట్టిగా చాటుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పకతప్పదు. రాష్ట్ర ప్రజలలో తెరాస సర్కార్ పాలన పట్ల ఏర్పడిన విముఖత తెదేపాకు అనుకూలంగా మారుతుందని, కనుక వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరపున 100 సీట్లు యువతకే కేటాయించి విజయం సాధించి అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి నమ్మకంగా చెపుతున్నారు. అయితే అదే సమయంలో అయన భాజపాలో చేరబోతున్నరంటూ మీడియాలో వార్తలు వస్తుండటం విశేషం. వాటిని ఆయన గట్టిగా ఖండించినప్పటికీ తెదేపా ప్రస్తుత పరిస్థితి చూస్తున్నవారందరూ ఏదో రోజు అయన పార్టీ మారడం ఖాయం అనే నమ్ముతున్నారు. 

ఆ వార్తలకు బలం చేకూర్చుతున్నట్లుంది భాజపా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన తాజా ప్రకటన. “ఒకవేళ రేవంత్ రెడ్డి భాజపాలో చేరినట్లయితే, ఆయనే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతారు,” అని మీడియాతో అన్నారు. 

నిప్పు లేనిదే పొగ రాదంటారు. కనుక మీడియాలో వస్తున్న వార్తలకు రాజా సింగ్ చేసిన ఈ తాజా ప్రకటనను కలిపి చూస్తే రేవంత్ రెడ్డి భాజపాలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. 

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తన సత్తా నిరూపించుకోవాలని భాజపా తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో భాజపా చాలా బలహీనంగా ఉంది. పార్టీ ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో తెదేపా కూడా బలహీనపడింది. ఆ రెండు పార్టీలు దూరం జరిగిన తరువాత ఇంకా బలహీనపడ్డాయి. అయితే అవి వేటికవి తమ ఉనికిని నిలుపుకొంటూ ఎన్నికలపొత్తులు పెట్టుకొన్నా ప్రయోజనం లేదని ఇప్పటికే నిరూపితం అయ్యింది. కనుక భాజపాలో తెదేపాను విలీనం చేసి, రేవంత్ రెడ్డి తో సహా తెదేపా నేతలందరూ భాజపాలో చేరిపోయినట్లయితే తెరాసకు బలమైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. 

వచ్చే ఎన్నికల తరువాత కూడా కేంద్రంలో మళ్ళీ మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కనుక తెలంగాణా తెదేపా నేతలు భాజపాలో చేరితే వారి రాజకీయ భవిష్యత్ కు డోకా ఉండదు. అలాగే తెదేపా నేతల చేర్చుకొన్నట్లయితే భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినప్పటికీ, మరిన్ని ఎక్కువ శాసనసభ స్థానాలు సాధించుకోగలదు. ఆరు ఎంపి సీట్లను గెలుచుకొనేందుకు అవకాశాలు మెరుగవుతాయి. 

కనుక తెదేపా నేతల వలన భాజపాకు, భాజపా వలన తెదేపా నేతలకు పరస్పర ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి 

చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తెదేపాపై ఎలాగూ ఆసక్తి కోల్పోయారు కనుక వారు భాజపాలో చేరడాన్ని ఆయన కూడా స్వాగతించవచ్చు. తద్వారా ఎన్డీయే ప్రభుత్వంతో ఆయన సంబందాలు ఇంకా బలపడతాయి కూడా. కనుక మున్ముందు రేవంత్ రెడ్డితో సహా తెదేపా నేతలు అందరూ భాజపాలో చేరిపోయే అవకాశాలున్నాయని భావించవచ్చు. రేవంత్ రెడ్డిని భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తుందా లేదా అనేది తరువాత సంగతి.  


Related Post