అక్కడ కిం..ఇక్కడ ట్రంప్..దొందూ దొందే!

April 15, 2017


img

ఉత్తరకొరియా, అమెరికాల మద్య ఏ నిమిషంలోనైనా ప్రత్యక్షయుద్ధం మొదలయ్యే ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఉత్తర కొరియా ఈరోజు తన సైనిక, ఆయుధ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించి చూపించింది. అమెరికాతో అణుయుద్దానికి సిద్దంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ తరపున ఆ దేశ మిలిటరీ అధికారి చోయ్‌ ర్యోంగ్ హాయి ప్రకటించారు. 

యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న ఉత్తర కొరియా పదేపదే క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర పరీక్షలు చేస్తూ అమెరికాపై అణుబాంబులు ప్రయోగిస్తామని హెచ్చరిస్తుండటంతో అమెరికా కూడా అప్రమత్తమై ధీటుగా స్పందించవలసి వస్తోంది. అమెరికా యుద్దనౌకలు ఉత్తర కొరియాకు సమీపంలో మొహరించి ఉండటంతో ఆ దేశ అధ్యక్షుడుకి యుద్ధోన్మాదం ఇంకా తలకెక్కిపోయింది. తమపై అమెరికా అణుదాడి చేసినా అమెరికాను దెబ్బ తీయకుండా విడిచిపెట్టబోమని కిమ్ జంగ్ విస్పష్టంగా ప్రకటించారు. అంటే అమెరికాకు ఒక కన్నుపోతుందంటే, తాము రెండు కళ్ళు పోగొట్టుకోవడానికైన సిద్దం అని ప్రకటించినట్లే ఉంది. 

ఈ యుద్ద వాతావరణంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రెండుదేశాల మద్య నిజంగా యుద్ధం జరిగితే వాటిలో ఎవరూ విజేతలు ఉండబోరని, అపారమైన ప్రాణనష్టం తప్ప సాధించేది ఏమీ ఉండబోదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి అన్నారు. రెండు దేశాలు అంగీకరిస్తే వాటి మద్య మధ్యవర్తిత్వం వహించడానికి చైనా సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ తన వద్ద ఉన్న ఖండాంతర క్షిపణులను అణ్వాయుధాలను చూసుకొని అమెరికాతో ఒక్కసారైనా యుద్ధం చేయాలని చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే అమెరికా శక్తి సామర్ధ్యాలను, దాని అత్యాధునిక ఆయుధ సంపత్తిని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే యుద్ధోన్మాదంతో కల్లు తాగిన కోతిలా రెచ్చిపోతున్నారు. 

మరోవైపు డోనాల్డ్ ట్రంప్ కూడా అతనికి ఏమాత్రం తీసిపోరు. ఆయనకీ చాలా ఆవేశం, దుందుడుకుతనం ఎక్కువే కనుక అవసరమైతే..లేదా వీలు చిక్కితే ఉత్తర కొరియాకు దాని అధ్యక్షుడు కిమ్ జంగ్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాలు భయానకమైన ఆయుధాలతో యుద్దరంగంలో ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. 

చైనా చెప్పినట్లు ఒకవేళ వాటి మద్య యుద్దమే జరిగితే, ఉత్తర కొరియా, దానిలో నివసిస్తున్న కోట్లాదిమంది ప్రజలు నామరూపాలు లేకుండా పోవచ్చు. అదేసమయంలో అది ప్రయోగించే ఖండాంతర అణు క్షిపణుల ధాటికి అమెరికాలో కూడా ఊహించలేనంత పెను విద్వంసం, ప్రాణనష్టం జరుగవచ్చు. అదే కనుక జరిగితే అప్పుడు అమెరికా అభివృద్ధి నిలిచిపోయి కొన్ని దశాబ్దాలు వెనక్కివెళ్ళిపోయే దుస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు అది తన అగ్రరాజ్యంహోదా కోల్పోవచ్చు. ఈ యుద్దంలో అమెరికా విజయం సాధించినప్పటికీ మళ్ళీ ఇప్పట్లో కోలుకోలేనంత నష్టం జరిగే ఆవకాశం ఉండవచ్చు. కనుక ఇకనైనా అమెరికా వెనక్కి తగ్గి చైనా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించడమే దానికి ప్రపంచ దేశాలకి కూడా మంచిది.  


Related Post