వచ్చే ఏడాది నుంచి తెలంగాణా రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తామని మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ రూపొందించుకొన్న ఆ పధకాన్ని తెరాస సర్కార్ హైజాక్ చేసిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అటువంటి చాలా పధకాలను తాము రూపొందించుకొన్నామని, వాటిలో ఉచిత ఎరువుల సరఫరా పధకం ఎలాగో బయటకు పొక్కి కేసీఆర్ చెవిన పడటంతో ఆయన హడావుడిగా దీనిని ప్రకటించేశారని విక్రమార్క ఆరోపించారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో తెరాస ఓటమి ఖాయమని గ్రహించినందునే కేసీఆర్ హడావుడిగా ఇటువంటి పధకాలను ప్రకటిస్తున్నారని కానీ వాటి అమలులో చిత్తశుద్ధి కనబరచడం లేదని అన్నారు. కాంగ్రెస్ రూపొందించుకొన్న ఈ పధకాన్ని హైజాక్ చేసిన కేసీఆర్ దానిని తక్షణమే అమలుచేయకుండా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తానని చెప్పడంలో అంతర్యం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఈ పధకానికి లబ్దిదారులను అధికారులు ఎంపిక చేస్తారా లేక తెరాస నేతలే ఎంపిక చేస్తారో చెప్పాలని అన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా దీనిని వర్తింపజేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పధకాలను తెరాస ఎత్తుకుపోయి తమవిగా ప్రకటించుకొన్నప్పటికీ, తమ పార్టీ వద్ద ఇంకా బ్రహ్మాండమైన అనేక పధకాలున్నాయని, ఇప్పుడు జరిగిన ఈ లీకేజిని దృష్టిలో ఉంచుకొని ఇకపై తమ పధకాలు లీక్ అవకుండా జాగ్రత్తలు తీసుకొంటామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
కాంగ్రెస్ ఎరువుల పధకాన్ని తెరాస సర్కార్ ఎత్తుకుపోయిందో లేదా అనేది అప్రస్తుతం. కానీ ఆ పధకాన్ని ప్రకటించి 2-3 నెలలలోగా అమలుచేసే బదులు దాని కోసం ఏడాది సమయం తీసుకోవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న నిర్ణయమేనని చెప్పక తప్పదు. పైగా ఇప్పటి నుంచే రైతులకు ఉచితంగా ఎరువుల సరఫరా చేయాలంటే తెరాస సర్కార్ పై చాలా ఆర్ధిక భారం పడుతుంది. కనుక ఈవిధంగా ఒక ఏడాది గడువు తీసుకొన్నట్లయితే ఆ భారం పడకుండా తప్పించుకోవచ్చు. కానీ ఈలోగా దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకోవచ్చనే ఆలోచన ఇమిడి ఉన్నట్లు కనబడుతోంది.