రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత విద్యుత్

April 14, 2017


img

ఇంతవరకు తెలంగాణా రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా రాష్ట్రంలో రైతులు అందరికీ ఉచిత విద్యుత్ అందించాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు..విద్యుత్ వాడకంపై ఇంతవరకు ఉన్న గరిష్ట పరిమితిని కూడా ఎత్తివేసింది. పోలీ హౌజ్, గ్రీన్ హౌజ్ పద్దతులలో సాగుచేస్తున్నవారికి కూడా ఉచిత విద్యుత్ అందించాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. కానీ కార్పోరేట్ వ్యవసాయానికి మాత్రం ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. రైతులకు ఉచిత విద్యుత్ భారాన్ని రాష్ట్రంలో ప్రజలపై మోపకూదదని మరో నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది విద్యుత్ చార్జీలు పెంచకూడదని, యధాతధంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఒకప్పుడు నిత్యం విద్యుత్ కోతలతో అల్లాడిన రైతన్నలకు నిరంతరంగా ఎటువంటి పరిమితులు విదించకుండా ఉచిత విద్యుత్ ఇవ్వడం చాలా గొప్ప విషయమేనని చెప్పక తప్పదు. కానీ దీనిని ఎక్కువ కాలం కొనసాగిస్తే, విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఉచితంగా విద్యుత్ ఇవ్వవచ్చు గానీ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. విద్యుత్ ఉత్పత్తికి సంస్థలు వేల కోట్లు ఖర్చు చేస్తుంటాయి. ఆ విధంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ను ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా రాష్ట్రంలో రైతులు అందరికీ ఉచితంగా అందిస్తే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం అందుకు కూడా ఒప్పుకోలేదు కనుక ఈ ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతున్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు నష్టాలు తప్పవు. కనుక రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం మోయవలసి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భరించగలదా?భరిస్తే ఎంతకాలం భరించగలదు? అనే సందేహాలు కలుగుతాయి. 



Related Post