తెరాస అధికారంలోకి వస్తే ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. గత మూడేళ్ళలో మొత్తం 3,700 మంది దళితులకి 9,743 ఎకరాలు పంపిణీ చేశారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 4,000 ఎకరాలను పంపిణీ చేయబోతున్నారు. మళ్ళీ జూన్ 2న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మరో 6,900 ఎకరాలు పంపిణీ చేయడానికి తెరాస సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు విడతలలో కలిపి మొత్తం 3,663 మంది దళితులకి 10,900 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయబోతున్నారు.
తెరాస సర్కార్ ఇప్పటికే పంట రుణాల మాఫీ చేసి ఆ హామీని నిలబెట్టుకొంది. దళితులకు 3ఎకరాల భూమి ఇచ్చే విషయంలో అనేక అవరోధాలు ఎదురవుతునందున దీనిలో కొంత ఆలశ్యం జరుగుతోంది. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాక ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ నిన్న మరో కొత్త హామీని ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఆర్ధిక సం.నుంచి రాష్ట్రంలో రైతులు అందరికీ ఎరువులు కొనుగోలు కోసం ఎకరానికి రూ.4,000 చొప్పున వారి ఖాతాలలో జమా చేస్తామని చెప్పారు. దేశంలో రైతులకు ఉచితంగా ఎరువులు అందించబోతున్న మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం తెరాస సర్కారే.
వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో 2.70లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి తెరాస సర్కార్ చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగునీటిని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తెరాస సర్కార్ ఎన్నికల హామీలను అమలుచేయడంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ, అమలుచేయడం మానుకోలేదని వీటి వలన స్పష్టం అవుతోంది.