తెరాస మంత్రులు, నేతలు తమ ప్రభుత్వ పని తీరుని వివరిస్తూ దేని గురించి మాట్లాడినా అది చారిత్రాత్మకం, నభూతో నభవిష్యత్ అని గట్టిగా చెప్పుకొంటుంటారు. నిజమే..తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేప్పటింది. త్రాగు,సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. విద్యుత్ కొరత తీరిపోయింది. పరిశ్రమల స్థాపనకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరమైన సహాయసహకారాలు అందజేస్తోంది. అంతా పచ్చగా..సారీ..గులాబీ రంగులో బాగానే కనబడుతోంది. కానీ తెరాస సర్కార్ చెపుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు మద్య చాలా తేడా ఉన్నట్లు కనబడుతోంది. అయితే అందుకు దానినే పూర్తిగా నిందించలేము. అధికారులు, ప్రజా ప్రతినిధుల అలసత్వం కొంత, ప్రకృతి కన్నెర్ర చేయడం మరికొంత..కారణంగా రాష్ట్రంలో మిర్చి, వరి, కూరగాయల రైతులు అల్లాడిపోతున్నారు.
వేసవి ఎండల కారణంగా అయితేనేమీ, ప్రభుత్వం చెప్పుకొంటున్నట్లు పొలాలకు నీళ్ళు అందించలేకపోవడం వలనయితేనేమి..సంగారెడ్డి జిల్లాలో నీరు లేక సుమారు 2,000 ఎకరాలలో వరి పంటలు ఎండిపోయాయి. మిషన్ కాకతీయ చేపట్టిన తరువాత పరిసర ప్రాంతాలలో భూగర్భజలాలు బాగా పెరిగిన మాట వాస్తవమే. కానీ ఈ ఏడాది జిల్లాలో నారాయణ్ ఖేడ్ పరిధిలో గల మనూరు, రేగోడ్, కంగ్డి మండలాలలో బోరుబావులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగడానికి కూడా నీళ్ళు లేక కష్టాలు పడుతున్నారు. ఇక పంటల సంగతి దేవుడెరుగు.. తెరాస సర్కార్ ఎరుగు!
వికారాబాద్ జిల్లాలో కూరగాయల రైతులది మరో రకం కష్టం. ఈసారి క్యాబేజీ పండించిన రైతులు వాటికి గిట్టుబాటు ధర రాకపోవడం కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు. తాము ఎంతో వ్యయప్రయాసలకోర్చి పండించి తెచ్చిన క్యాబేజీకి కేజీకి రూ.3-4లు మాత్రమే ఇస్తామని దళారులు, వ్యాపారులు చెపుతున్నారని, దానితో రవాణా, కూలి ఖర్చులు కూడా రావని వాపోతున్నారు. కానీ కూరగాయల మార్కెట్లలో రూ.15-20 పెడితే గానీ క్యాబేజీ దొరకదు. అంటే అక్కడ రైతులు, ఇక్కడ వినియోగదారులు ఇద్దరూ నష్టపోతుంటే, మద్యలో దళారీలు మాత్రం చేతికి మట్టి అంటకుండా డబ్బు సంపాదించుకొంటున్నారని స్పష్టం అవుతోంది.
రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 1.56 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. మెదక్ జిల్లాలో రామాయం పేటలో 450 ఎకరాలు, నిజాంపేటలో 470ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. ఇక ముందు కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇంకా అనేక వేల ఎకరాలలో పంటలు ఎండిపోవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం యుద్దప్రాతిపదికన రైతులను ఆదుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి,” అని కోరారు.
ఈ సమస్యలను చూస్తున్నట్లయితే కొంత ప్రకృతి వైపరీత్యం, మరికొంత అధికారుల వైఫల్యం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రకృతి వైపరీత్యాన్ని అధిగమించేందుకు తెరాస సర్కార్ చాలా చక్కగానే కృషి చేస్తోంది కానీ దాని అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం, అసమర్ధత కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కనుక ముందుగా ఈ సమస్యపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టవలసి ఉంది.