తమిళనాడులో మరో సంక్షోభం?

April 06, 2017


img

జయలలిత మృతితో తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం తదనంతర పరిణామాలు అందరూ చూశారు. ప్రస్తుతం అంతా సర్దుకొన్నట్లే కనబడుతోంది. కానీ త్వరలో మళ్ళీ మరో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

శశికళ జైలుకు వెళుతూ పార్టీమీద, ప్రభుత్వం మీద తన పట్టునిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో తన మేనల్లుడు దినకరన్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. అతను అన్నాడిఎంకె తరపున ఆర్.కె.నగర్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో అతను విజయం సాధించినట్లయితే, ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామిని తొలగించి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని అన్నాడిఎంకె పార్టీలో జోరుగా పుకార్లు సాగుతున్నాయి. 

పళనిస్వామి ఇంతవరకు ఒక్కసారి కూడా బెంగళూరు వెళ్ళి జైలులో ఉన్న శశికళను పలుకరించలేదు. పైగా ప్రభుత్వంపై, పార్టీపై పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సహజంగానే ఇది శశికళకు ఆగ్రహం కలిగిస్తుంది కనుక  పళనిస్వామిని తప్పించి ఆయన స్థానంలో తన మేనల్లుడు దినకరన్ ను కూర్చోబెట్టాలని భావించడం సహజమే. 

కనుక పళనిస్వామి కూడా తన కుర్చీని కాపాడుకోవడం కోసం పావులు కదపడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈనెల 12న జరుగబోయే ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలలో దినకరన్ ను గెలవకుండా చేసేందుకు, శశికళను వ్యతిరేకిస్తున్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో తెర వెనుక చేతులు కలుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అంగీకరిస్తే మళ్ళీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి కూడా ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా ఇద్దరూ కలిసి శశికళ, దినకరన్ లకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం అందుకు అంగీకరించకపోతే, పళనిస్వామికి దినకరన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లే భావించవచ్చు. 


Related Post