తెరాస సర్కార్ రాష్ట్రంలో బడుగుబలహీనవర్గాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించేందుకు బారీగా గొర్రెలు, మేకలు, గేదెలు అందిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ అన్నం పెట్టడం కంటే అన్నం సంపాదించుకొనే మార్గం చూపడం చాలా మంచి ఆలోచనే. అయితే అకస్మాత్తుగా పెరిగిన ఎండలు, నీటి కొరత కారణంగా అనేక జిల్లాలలో పశువులకు నీరు, ఆహారం అందించలేక వాటి యజమానులు కబేళాలకు అమ్ముకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహబూబ్ నగర్ లో దేవరకద్ర, పెబ్బేరు, జడ్చర్ల, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాలలో గడ్డి కొరత తీవ్రంగా ఉండటంతో ఇదే అదునుగా దళారులు పశువులకాపరులకు మాయమాటలు చెప్పి తక్కువధరలకే పశువులను కొని కబేళాలకు తరలించుకొని పోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాలోను ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఈసారి వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో రైతులు మిర్చి పంట పండించినందున అక్కడ కూడా పశుగ్రాసం లభించడం లేదు. కరీంనగర్ జిల్లాలో రైతులు తమ పంటలను కాపాడుకోవాలో లేదా పశువులను కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కొందరు రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం తమ వరి పొలాలలోకి పశువులను తోలి చేతికి అందివస్తున్న వరిపంటను వాటికి ఆహారంగా పెడుతున్నారు.
ఇక రాష్ట్రంలో గడ్డికి నిజంగానే కొరత ఏర్పడిందో లేక పసువులను కబేళాలకు తరలించడానికే కృత్రిమ కొరత సృష్టించారో తెలియదు కానీ ఖమ్మం జిల్లాలో ఇదివరకు ఒక ట్రాక్టర్ లోడు ఉన్న వరిగడ్డి రూ.3,000 ఉండగా అది ఇప్పుడు రూ.13,000కు అమ్ముతున్నారు. దీనితో అంత ధర పెట్టి గడ్డికొనలేని రైతులు తమ కళ్ళముందే ఆకలితో అల్లాడిపోతున్న మూగజీవాలను చూసి బాధతో దళారులకు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కబేళాలకు తరలిపోతున్న ఆవులు, గేదెల లారీలు కనిపిస్తూనే ఉన్నాయి.
మిషన్ కాకతీయతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. పూర్తయిన కొన్ని ప్రాజెక్టుల వలన నీటి కొరత కూడా తీరింది. రాష్ట్రంలో క్రమంగా ఆయకట్టు పెరుగుతోంది. విద్యుత్ సమస్య లేదు. ప్రభుత్వం కూడా రైతులకు అన్ని విధాల సహకరిస్తోంది. అయినా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? లోపం ఎక్కడ ఉంది? ప్రభుత్వం పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, అదే నిష్పత్తిలో రాష్ట్రంలో పశుగ్రాసం పెంచడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాలి కదా?ఈ పశుగ్రాసం కొరత సమస్యకు ప్రభుత్వం తక్షణం పరిష్కారం కనుగొనవలసి ఉంది. లేకుంటే నోరులేని మూగజీవాలన్నీ ఆకలితో మాడుతూ కబేళాలకు తరలిపోవడం ఖాయం.