ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న జీవన్ రెడ్డి, కేసీఆర్ సూచన మేరకు జగిత్యాలలో ఈ నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీని ఏర్పాట్లు, జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తోడ్పాటు అందించాలని కేసీఆర్ ఆదేశించారు. కనుక జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ హడావుడిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “ఈనెల 20న జరిగే బీఆర్ఎస్ పార్టీ సభకు కేసీఆర్ హాజరవుతారు. కనుక మనమందరం కలిసి ఈ సభ విజయవంతం చేయాలి,” అని అన్నారు.
ఈ నెల 25న కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని ముందే చెప్పారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు వదులుకున్నారు కనుక ఆ పేరు ఫ్రీగా ఉందని ఎవరైనా వాడుకోవచ్చని కల్వకుంట్ల కవిత అన్నారు.
బహుశః అందుకే జగిత్యాల బహిరంగ సభ 5 రోజుల ముందుగా ముహూర్తం పెట్టుకున్నారేమో? ఏది ఏమైనప్పటికీ మళ్ళీ చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కనుక ఆయన కొత్తగా ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి ఏర్పడుతుంది. అదేరోజు జీవన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకొనవచ్చు.