కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్ ప్రస్తావన మైండ్ గేమ్‌... ఫౌల్ గేమ్‌?

July 19, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాటలు వింటున్నప్పుడు ఆయనలో నానాటికీ అసహనం పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్‌ సాక్ష్యాధారాలు చూపి నిరూపించాలని సవాలు విసిరారు. 

కానీ తాను ఏపీ మంత్రి నారా లోకేష్‌ని రహస్యంగా కలిశాననే రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్‌ మాట్లాడిన మాటలు ఆ ఆరోపణని ద్రువీకరిస్తున్నట్లున్నాయి, ఆవిధంగా మాట్లాడి బీఆర్ఎస్‌ పార్టీ పట్ల ప్రజలలో అనుమానాలు కూడా రేకెత్తించారు. 

ఈ సందర్భంగా  సిఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు అయన తన మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాదంటే రేవంత్ రెడ్డి తన మనుమడిపై ప్రమాణం చేయాలని కేటీఆర్‌ సవాలు విసిరారు. తద్వారా రేవంత్ రెడ్డిపై మంత్రులకు అనుమానాలు రేకెత్తి విభేదాలు ఏర్పడతాయని కేటీఆర్‌ భావించి ఉండవచ్చు. 

ఓ పక్క కేసీఆర్‌ హయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ చేత దర్యాప్తు జరిపిస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ల మెడకు ఉచ్చు బిగించాలని ప్రయత్నిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తారనుకోవడం అవివేకమే కదా?  

ఒకవేళ రేవంత్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని మంత్రులకు ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే వారు కాంగ్రెస్‌ అధిష్టానానికి పిర్యాదు చేస్తారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేతులు కలుపుతారు. అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోల్పోతారు. 

కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటినప్పటి నుంచి తన మంత్రులకు సముచిత గౌరవం, ప్రాధాన్యం, స్వేచ్చ ఇస్తూ వారి నమ్మకం పొందగలుగుతున్నారు. అందుకే పలువురు మంత్రులు కేటీఆర్‌ వ్యాఖ్యలపై వెంటనే స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఖండించడమే కాకుండా బీఆర్ఎస్‌ పార్టీపై ఎదురుదాడి కూడా చేశారు.

ప్రస్తుతం వందల మంది ఫోన్‌ ట్యాపింగ్ బాధితులు సిట్ అధికారుల ముందు హాజరయ్యి కేసీఆర్‌ తమ ఫోన్లు ఏవిదంగా ట్యాపింగ్ చేయించారో చెపుతున్నప్పుడు, కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్ గురించి మాట్లాడటం రాజకీయంగా తప్పటడుగే. కనుక రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టబోయి కేటీఆర్‌ బీఆర్ఎస్‌ పార్టీకే నష్టం కలిగించుకుంటున్నారని చెప్పక తప్పదు. 


Related Post