కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమీషన్ చేత విచారణ జరిపిస్తోంది. కానీ దానిలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరుగలేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమని అప్రదిష్ట పాలుజేసేందుకే ఈ డ్రామా మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిలువ చేయకుండా రైతులకు నష్టం కలిగిస్తోందని వాదిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య ఈ వాదోపవాదాలు సాగుతుండగానే ఏసీబీ అధికారులు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న, పని చేసి పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇళ్ళలో సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించి భారీ మొత్తంలో నగదు, వెండి బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కనుగొంటున్నారు.
ఏసీబీకి చిక్కిన వారిలో ఈఎన్సీ భూక్యా హరిరామ్, ఎస్ఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్, ఏఈఈ రవికిషోర్, ఈఈ అర్రంరెడ్డి అమర్నాధ్ రెడ్డి, ఎస్సారెస్పీ డివిజన్-8 ఈఈ శ్రీధర్, తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఉన్నారు. వీరందరూ తమ ఆదాయానికి మించి వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్నట్లు ఏసీబీ అధికారులు కనుగొని కేసులు నమోదు చేశారు. మురళీధర్ రావుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ మీద చంచల్‌గూడా జైలుకి తరలించారు.
కేసీఆర్ హయంలో సాగునీటి శాఖకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పలు ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిని ఓ సువర్ణవకాశంగా భావించిన ఆ శాఖలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఈ ఏసీబీ కేసులతో తేటతెల్లమవుతోంది.
ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్ర పోషించే ఇంజనీర్లు, అధికారులు ఈవిదంగా అవినీతికి పాల్పడినందునే మేడిగడ్డ బ్యారేజి కేసీఆర్ హయాంలోనే క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, సుందిళ్ళ బ్యారేజీలు కూడా అప్పుడే దెబ్బ తిన్నాయి.
కనుక కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. పీసీ ఘోష్ కమీషన్ నివేదిక కూడా ప్రభుత్వం చేతికి వస్తే అసలు కధ బయటపడుతుంది.
అవినీతి జరగడం ఒక ఎత్తు అయితే, లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు నిరుపయోగంగా మారడం మరో ఎత్తు. కానీ ప్రభుత్వం రాజకీయ కారణాలు, ఒత్తిళ్ళ కారణంగా అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోలేకపోతే అవినీతికి పాల్పడినా ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యం ప్రజాప్రతినిధులలో, అధికారులలో ఏర్పడకుండా ఉంటుందా?