మల్లన్న, కవిత: ఎవరి ఆరాటం వారిదే?

July 13, 2025


img

బీసీ రిజర్వేషన్స్ గురించి ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మద్య మొదలైన గొడవ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో లేరు. ఆమె బీఆర్ఎస్‌ పార్టీ లేరిప్పుడు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన బీసీ రిజర్వేషన్స్ పేరుతో ఇద్దరూ రాజకీయ మైలేజ్ పొందాలని ఆరాటపడుతున్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి తనను తాను వెలివేసుకొన్నట్లయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన రాజకీయ మనుగడ కాపాడుకోసం ఆరాటపడుతున్నారు. అందుకు ఆమె బీసీ రిజర్వేషన్స్ అంశం భుజానికెత్తుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటన వెలువడగానే అది తన విజయమేనని, రాజకీయాలలో ఒక మెట్టు ఎక్కానని చెప్పుకున్నారు. తన పోరాటాలు ఫలించినందున అందరూ పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో ఏకాకిగా మారిపోయిన కల్వకుంట్ల కవితకు ఇటువంటి బూస్టింగ్ చాలా అవసరమే కనుక బీసీ రిజర్వేషన్స్ అంశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. 

ఈ గొడవ తర్వాత మీడియాతో మాట్లాడిన తీన్మార్‌ మల్లన్న పొరపాటున తన మనసులో ఆలోచనని బయటపెట్టేశారు. రాజకీయాలలో రాణించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి సంపాదించుకున్నారు కూడా. 

కానీ సిఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కానీ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉందనే విషయం తీన్మార్ మల్లన్న ఎప్పుడో పసిగట్టారు. కనుక బీసీ రిజర్వేషన్స్, బీసీల హక్కులు, పోరాటాలు అంటూ హడావుడి చేస్తున్నారు. 

ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే దొరబిడ్డ (కల్వకుంట్ల కవిత) ఓర్వలేకపోతున్నారు. అందుకే బీసీనైన నాపై దాడి చేయించారు. కానీ ఎవరెన్ని దాడులు, కుట్రలు చేసినా బీసీ పార్టీ పెట్టడం ఖాయం,” అని మనసులో మాట బయటపెట్టేశారు. 

తీన్మార్ మల్లన్న బీసీ జనాభా, వారి ఓట్లు నమ్ముకొని ముందుకు సాగాలనుకుంటున్నారు కనుక మద్యలో కల్వకుంట్ల కవిత వచ్చి బీసీలను తన్నుకుపోతున్నారని ఆందోళన చెందినట్లున్నట్లున్నారు. అందుకే ఆమెపై ఆ విదంగా అక్కసు వెళ్ళగక్కారనుకోవచ్చు. అంటే ఎవరి తాపత్రయం వారిదేనన్న మాట!


Related Post