కవిత పోరాటాలు ఎవరి కోసం?

July 11, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీలో కల్వకుంట్ల కవిత పరిస్థితి ఏమిటో ఆమెకే తెలియదు. తాజా ఇంటర్వ్యూలో ‘నేను పార్టీకి కావాలో వద్దో కేసీఆర్‌నే అడగండి’ అనడమే ఇందుకు నిదర్శనం. 

తాను మరో 30 ఏళ్ళు రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నానని, ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కావాలనుకుంటున్నానని అదే ఇంటర్వ్యూలో చెప్పారు. కనుక ఆమె సొంత పార్టీకి దూరమైనా రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. 

బీసీ రిజర్వేషన్స్ కోసం ‘రైల్ రోకో’ పిలుపునివ్వడం, ఏపీలో కలిపిన 5 పంచాయితీలని తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ వ్రాయడం, తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీల గురించి సిఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తామని చెప్పడం వంటివన్నీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు సంబందించిన సమస్యలే. కనుక ఆమె వాటి గురించే పోరాడుతున్నట్లు అనుకోవచ్చు. 

కానీ స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చక్కబెట్టుకోవడం రాజకీయ నాయకులు అందరూ చేసేదే. కల్వకుంట్ల కవిత కూడా అదే చేస్తున్నారనుకోవచ్చు. 

ఆమె బీఆర్ఎస్‌ పార్టీకి దూరమైనప్పటికీ కేసీఆర్‌ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు కనుక కల్వకుంట్ల కవిత కూడా వేరే పార్టీలో చేరేందుకు లేదా సొంత కుంపటి పెట్టుకునేందుకు తొందరపడటం లేదు. 

కానీ ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారు కనుక ఇటువంటి అంశాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయాలలో తన ఉనికిని కాపాడుకుంటున్నారని చెప్పవచ్చు. 

నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడంతో ఆమె తొలి విజయం సాధించినట్లయింది. 

కనుక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే ఇతర హామీలు, అంశాలకు షిఫ్ట్ అయ్యి మళ్ళీ పోరాటాలు మొదలుపెట్టేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చి సిఎం రేవంత్ రెడ్డిని నిలదీయబోతున్నట్లు ఆమె చేసిన తాజా ప్రకటనే ఇందుకు ఉదాహరణ. 

రాజకీయాలలో రాణించాలనుకునేవారు సమస్యలు ఎదురైనప్పుడు అస్త్ర సన్యాసం చేయకుండా ఏవిదంగా ముందుకు సాగుతుండాలో కల్వకుంట్ల కవిత చక్కగా నిరూపించి చూపుతున్నారు. కానీ ఆమె పోరాటాలు తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసమా లేక తన రాజకీయ మనుగడ కోసమా? అంటే రెండింటి కోసమే!


Related Post