మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏడవ బ్లాకులో మూడు పిల్లర్లు క్రుంగిపోయినప్పటి నుంచి ఎగువన మహారాష్ట్ర నుంచి బ్యారేజీలో వస్తున్న గోదావరి వరద నీటిని నిలువచేయకుండా 85 గేట్లు ఎత్తివేసి దిగువకు విడిచిపెట్టేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న వాదోపవాదాలు అందరికీ తెలిసిందే.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు క్రుంగిపోయినట్లు గుర్తించిన తర్వాత దానిపైకి ఎవరూ రాకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుని ప్రభుత్వం తొలగించింది. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ఆ బ్యారేజ్ మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలంలోని అంబటిపల్లి మీదుగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అలాగే కొత్తపల్లి, పడిదం, రంగాజామ్ పేట, అంకిసా, మెట్లటెక్కడ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు కూడా బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లలో మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా ప్రయాణిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ మరింత క్రుంగిపోయి బ్యారేజ్ కూలిపోకుండా కాపాడుకొనేందుకు ఇంతకాలం బ్యారేజి మీదకు వాహనాలను అనుమతించలేదు. కానీ ఇప్పుడు చెక్ పోస్టులను ఎత్తివేసి బ్యారేజ్ మీదుగా భారీ వాహనాలను అనుమతించడం అంటే అది మరింత క్రుంగిపోయి దానంతట అదే కూలిపోయేలా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రే అని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది.
ఈ మేరకు ఆ పార్టీ సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో ‘మేడిగడ్డ కూలిపోయేలా కుట్ర?అనే శీర్షికతో ఓ వార్త ప్రచురించింది కూడా.
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు క్రుంగిపోయాయని గుర్తించినా ఇంతవరకు మరమత్తులు చేయించకుండా లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఆంధ్రాకు విడిచి పెట్టేస్తూ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆరోపించింది.
ఇప్పుడు బ్యారేజ్ మీదకు భారీ వాహనాలని అనుమతించడం ద్వారా బ్యారేజ్ కూలిపోయేందుకు కుట్రలు చేస్తోందని ‘నమస్తే తెలంగాణ’ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందో?