ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు వస్తున్నా: ప్రభాకర్ రావు

June 01, 2025


img

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కదలిక మొదలవబోతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ వారంలో అమెరికా నుంచి హైదరాబాద్‌ తిరిగి రాబోతున్నారు. 

తనకు వన్ టైమ్ ఎంట్రీ పాస్ పోర్టు లభించగానే భారత్‌ వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ఇదివరకే సుప్రీంకోర్టుకి తెలియజేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు తాను జూన్ 5న విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు తెలియజేశారు. దీంతో ఇంతకాలం స్తబ్దుగా ఉండిపోయిన ఈ కేసులో మళ్ళీ కదలిక రాబోతోంది. 

ఈ కేసులో అరెస్ట్‌ అయిన పోలీస్ అధికారులు, ఇతర నిందితులు అందరూ కూడా తాము ప్రభాకర్ రావు ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని, ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాలలో నగదు తరలించి బిఆర్ఎస్ పార్టీ నేతలకు అందజేసేవారిమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 

కనుక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రభాకర్ రావు ఈ కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు విచారణలో నోరు విప్పి నిజాలు బయటపెడితే మాజీ సిఎం కేసీఆర్‌తో సహా పలువురు మాజీ మంత్రులు, బిఆర్ఎస్ నేతల మెడకు ఈ కేసు చుట్టుకోవడం ఖాయం. 

ఇప్పటికే కాళేశ్వరం కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ కేసీఆర్‌, హరీష్ రావులను జూన్ 5,9 తేదీలలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. దానికి వారిరువురూ హాజరు కాబోతున్నారు.

ఆ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తమ మెడకు చుట్టుకుంటుందని కేసీఆర్‌ ముందే ఊహించారు. బహుశః అందుకే కేసుల నుంచి ఉపశమనం కొరకు బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేందుకు సిద్దమయ్యి ఉండవచ్చు. 



Related Post