అమెరికా-చైనా... తగ్గేదేలే!

April 09, 2025


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇటీవల అన్ని దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటిలో చైనాపై విధించిన సుంకాలు తాజా పెంపుతో కలిపి 54 శాతంకి చేరుకోవడంతో ఆ దేశం కూడా ప్రతీకార చర్యగా అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాలు విధించింది. 

చైనా నిర్ణయంపై భగ్గుమన్న డోనాల్డ్ ట్రంప్‌ తక్షణం పెంచిన సుంకాలు ఉపసంహరించుకోవాలని లేకుంటే చైనా దిగుమతులపై మరో 50 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. మంగళవారం వరకు గడువు విధించారు కానీ చైనా పట్టించుకోలేదు. దాంతో డోనాల్డ్ ట్రంప్‌ చెప్పిన్నట్లుగానే చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని ఉత్పత్తులపై మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో చైనా ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు ఇప్పుడు గరిష్టంగా 104 శాతానికి చేరుకున్నాయి. 

అమెరికా-చైనాల మద్య మొదలైన ఈ వాణిజ్య యుద్ధాల వలన రెండు దేశాలు తీవ్రంగా నష్టపోబోతున్నాయి. దీని వలన చైనా ఎక్కువగా నష్టపోతుంది. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఎగుమతి చేసినా ఆ ఉత్పత్తుల ధరలు ఒకేసారి 104 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగిపోతాయి. కనుక అమెరికాలో ఎవరూ వాటిని కొనడానికి ఇష్టపడరు. కనుక చైనా ఉత్పత్తి సంస్థలు నష్టపోతాయి. అవి నష్టపోతే వాటిలో పనిచేసే ఉద్యోగులని తొలగించుకొని భారం తగ్గించుకునే ప్రయత్నం చేయకమానవు. ఇక చైనా ఎగుమతి దిగుమతులు నిలిచిపోతే ఆ రంగంలో ఉన్న సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి. 

ఇక అమెరికాలో ఇతర దేశాల ఉత్పత్తులతో పోలిస్తే చైనా ఉత్పత్తులు చవుకగా లభిస్తుంటాయి. కానీ వాటి ధరలు పెరిగిపోతే అమెరికాలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. తప్పనిసరి అయితే భారీగా సొమ్ము చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది కనుక వారు కూడా నష్టపోతారు. 

రెండు బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న అమెరికా, చైనాల మద్య ఈ పంతాలు, పట్టింపులు, వాణిజ్య యుద్ధాలు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో తెలీదు. కానీ భారత్‌తో సహా ఇతర దేశాలు దీనినే ఓ గొప్ప అవకాశంగా మలుచుకొని అమెరికాకు ఎగుమతులు పెంచి లాభపడవచ్చు కూడా. 



Related Post