బిఆర్ఎస్‌కి కష్టం వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన్నట్లే!

March 15, 2025


img

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, సభా మర్యాదలు గుర్తుండవు. కానీ ఓడిపోయిన తర్వాత వాటిని ప్రస్తావిస్తూ తమకు అన్యాయం జరిగిపోయిందంటూ ఆ పార్టీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటారు. 

మొన్న శాసనసభలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఉద్దేశించి చులకనగా మాట్లాడారు. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఒక్కోసారి ఆవేశంలో నోరు జారుతుంటారు. కానీ వెంటనే తప్పు సరిదిద్దుకుంటే వారికే హుందాగా ఉంటుంది. కానీ తప్పు చేయలేదని వాదించడం, అందుకు సభ నుంచి సస్పెండ్ చేస్తే ఆ పార్టీ నేతలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ధర్నాలు చేయడం ఇంకా పెద్ద తప్పు. 

బిఆర్ఎస్ పార్టీని సభలో ఎదుర్కోలేమనే భయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈవిదంగా తమని బయటకు పంపించేసిందని బిఆర్ఎస్ పార్టీ నేతల వాదన అర్దరహితమే. ఒకవేళ వారు ఇది గ్రహిస్తే జగదీష్ రెడ్డి చేత స్పీకర్‌కి క్షమాపణ చెప్పించి  అందరూ శాసనసభలోనే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు కదా? అప్పుడు వారు చెప్పుకొంటున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడేది కదా?

కానీ బిఆర్ఎస్ నేతలకు కావలసింది అది కాదు. ఈ పేరుతో రాద్దాంతం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడమే. అందుకే టాంక్ బండ్ మీద, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారని చెప్పొచ్చు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏవిదంగా ఖూనీ చేశారో, ఫిరాయింపులతో ప్రతిపక్షాలను ఏవిదంగా దెబ్బ తీశారో అందరికీ తెలుసు. నాడు ఫిరాయించిన నేతలను కేసీఆర్‌, కేటీఆర్‌ పక్కన పెట్టుకునే, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో కేసు వేయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.  

నాడు కేసీఆర్‌ ధాటిని తట్టుకోలేక కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌లో, ప్రొఫెసర్ కోదండరామ్ తన ఇంట్లో తలుపులు వేసుకొని నిరసన దీక్షలు చేసుకుంటుంటే, పోలీసులతో తలుపులు పగులగొట్టించి మరీ వారిని అరెస్టులు చేయించారు కదా? అప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదు. 

శాసనసభ నుంచి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపించేసినప్పుడూ ప్రజాస్వామ్యం గుర్తురాలేదు. కానీ ఇప్పుడు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. 

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రతిపక్షాలను గౌరవించి ఉండి ఉంటే నేడు వారికీ ఈవిదంగా నిరసన తెలియజేసేందుకు నైతిక హక్కు ఉండేది.  



Related Post