మాజీ సిఎం కేసీఆర్ చాలా నెలల తర్వాత ఇవాళ్ళ శాసనసభ సమావేశానికి వచ్చారు. ఆయనకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికి లోనికి తోడ్కొని తీసుకువెళ్ళారు.
ఆనవాయితీ ప్రకారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభసభల సభ్యులని ఉద్దేశించి ప్రసంగిస్తుండగానే, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నీ అబద్దాలు చెప్పిస్తోందంటూ నినాదాలు చేశారు.
వారు నినాదాలు చేస్తుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోయారు. తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడింది. తర్వాత బీఏసీ కమిటీ సమావేశం నిర్వహించి, శాసనసభ సమావేశాల అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు.
కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి శాసనసభలో లేవనెత్తాల్సిన అంశాలు, సభలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశానిర్దేశం చేశారు. కనుక ఆయన సూచన మేరకే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా నినాదాలు చేశారని భావించవచ్చు.
ఒకవేళ కాదనుకుంటే గవర్నర్ పట్ల కనీసం మర్యాద చూపుతూ, సభలోనే ఉన్న కేసీఆర్ వారిని వారించి ఉండాలి. కానీ అలా చేయలేదు.
గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు ఉన్నాయని కేసీఆర్ భావిస్తే, రేపు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, ఆయన చేత ఆవిదంగా ఎందుకు చెప్పించారని సిఎం రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీయవచ్చు కదా?
దాదాపు ఏడాదిపైగా శాసనసభకు మొహం చాటేసిన కేసీఆర్, ఈరోజు శాసనసభకు రాగానే ముందుగా స్పీకర్‌కు, శాసనసభ సభ్యులకు క్షమాపణ చెప్పుకొని ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ సభలో అడుగుపెడుతూనే తన ఎమ్మెల్యేల చేత అల్లరి చేయించి ‘చిల్లర రాజకీయాలు’ చేశారని చెప్పక తప్పదు. తమ ఎమ్మెల్యేల తీరుని కేసీఆర్, కేటీఆర్ సమర్ధించుకోగలరా?