శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ వరుస ఓటములు, అధ్యక్షుడు కేసీఆర్ తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవలసి రావడం, మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్, పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం వంటి పరిణామాలతో బిఆర్ఎస్ క్యాడర్ ఎంత ఢీలా పడిందో అందరికీ తెలుసు.
ఇవన్నీ సరిపోవన్నట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎఫ్-1 రేసింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు, కుంభకోణాలపై కమీషన్ల చేత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తుండటం, ఒకానొక సమయంలో కేటీఆర్ అరెస్టుకి రంగం సిద్దమవడం చాలా ఆందోళన కలిగించేవే.
అయినా కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాకపోవడంతో బిఆర్ఎస్ పార్టీ ఆత్మవిశ్వాసం దెబ్బ తింది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో మరో పార్టీ అయితే విచ్చినం అయిపోయేది. కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి బిఆర్ఎస్ పార్టీని కాపాడుకున్నారు.
ఎట్టకేలకు కేసీఆర్ నేడు తెలంగాణ భవన్‌కు వచ్చి శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ కూడా పాల్గొనబోతున్నారు.
కనుక దాదాపు 15 నెలలుగా ఈ పరిణామాలతో నీరసించిపోయి, ఆత్మస్థయిర్యం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ క్యాడర్‌కు ఇంతకంటే గొప్ప సంతోషకరమైన వార్త ఏముంటుంది?
కేసీఆర్ వస్తే ఇక శాసనసభలో బయటా కూడా బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం కాంగ్రెస్ నేతలకు చాలా కష్టమే అవుతుంది. కనుక వారు కూడా కేసీఆర్‌ని ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం సిద్దం చేసుకోవాలి. లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని బాధపడి ప్రయోజనం ఉండదు.