ఈసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్‌ హాజరు?

March 09, 2025


img

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరైతే అది కూడా ఓ ప్రధాన వార్తవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆయన శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తుండటమే ఇందుకు కారణం. 

ఈ నెల 12 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక దానికి ముందు రోజు అంటే మంగళవారం మద్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో లేవనెత్తాల్సిన అంశాలు, ఎన్నికల హామీల అమలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలు తదితర అంశాలపై కేసీఆర్‌ తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తారని వేరే చెప్పక్కరలేదు. ఆయనే స్వయంగా ఈసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు కనుక ఈసారి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. కానీ ఈ విషయం బిఆర్ఎస్ పార్టీ వెల్లడించలేదు. 

ఒకవేళ ఆయన శాసనసభ సమావేశాలకు హాజరైతే, ఆయనను ఎదుర్కోవడానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక వ్యూహం సిద్దం చేసుకోవాలి. కానీ రాకపోతే ఎప్పటిలాగే కాంగ్రెస్‌ మంత్రులే ఆయనని వేలెత్తి చూపుతూ విమర్శించగలుగుతారు. 

ఇటీవల ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌ సభ నిర్వహణతో సహా పార్టీ భవిష్య కార్యాచరణ గురించి మాట్లాడారు. కనుక ఈసారి ఆయన తప్పకుండా శాసనసభ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


Related Post