బిఆర్ఎస్ కోసం ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలా?

March 04, 2025


img

పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేయడంపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ రాహుల్ గాంధీని ఉద్దేశించి, “మీరు ప్రజా ప్రతినిధుల ఫిరాయింపు చట్టం గురించి మాట్లాడుతుంటారు. కనుక ధైర్యం ఉంటే ముందుగా మీ పార్టీలో చేర్చుకున్న 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కోండి. లేకుంటే ఫిరాయింపు చట్ట సవరణ గురించి మాట్లాడటం మానుకోండి,” అని ట్వీట్ చేశారు. 

దేశంలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలకు చేతలకు ఎప్పుడూ తేడా ఉంటుంది. వారి రాజకీయ అవసరాల కోసం అనేకం మాట్లాడుతుంటారు. కానీ వాటన్నిటికీ వారు కట్టుబడి ఉండరనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని లేదా వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని వాదిస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నారు. అప్పుడు వాటిని గట్టిగా సమర్ధించుకున్న కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు అన్యాయం, అనైతికం అని వాదిస్తున్నారు.  

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ నిలకడగా ఇదే వైఖరితో లేరు. వరుస ఓటములతో పార్టీ నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలపై అనర్హత కోసం పెద్దగా ఒత్తిడి చేయలేదు. కానీ ఇప్పుడు ఒత్తిడి పెంచారు. అంటే ఉప ఎన్నికలు ఎదుర్కొనే స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉందని భావిస్తుండటం వల్లనే అని అనుకోవచ్చు. 

కనుక బిఆర్ఎస్ పార్టీకి వర్తించని అనర్హత చట్టం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎందుకు వర్తింపజేయాలి? బిఆర్ఎస్ పార్టీకి పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు, అది ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాల్సిన అవసరం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకు?

అయినా సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కోసం 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తన ప్రభుత్వాన్ని తానే బలహీన పరుచుకొని కూలదోసుకుంటారా? ఆయనకు ఆ అవసరం ఏమిటి?ఒకవేళ భవిష్యత్‌లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇవే పరిస్థితులు ఏర్పడితే అప్పుడు రేవంత్ రెడ్డి లేదా మరొకరో ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించమంటే కేసీఆర్‌, కేటీఆర్‌ చేయిస్తారా?


Related Post