ఎస్ఎల్‌బీసీ సొరంగంలో నీచ రాజకీయాలు.. అవసరమా?

February 22, 2025


img

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బాంక్ కెనాల్) ఎడమ వైపు సొరంగంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో లోపల పనిచేస్తున్న కార్మికులు అందరూ సురక్షితంగా బయటకు వచ్చేశారని మొదట సమాచారం వచ్చినప్పటికీ, లోపల ఇంకా 8 మంది చిక్కుకున్నారని తాజా సమాచారం. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయ చర్యలు జోరుగా సాగుతున్నాయి. 

ఈరోజు ఉదయం సొరంగం తొలిచే యంత్రంతో పనులు మొదలుపెట్టిన కొద్దిసేపటికే 14వ కిమీ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది.   

సొరంగం తవ్వకం పనులతో ప్రభుత్వానికి నేరుగా ఎటువంటి సంబంధమూ ఉండదు. అక్కడి అధికారులు, ఇంజనీర్లు పనులు పర్యవేక్షిస్తుంటే బోరింగ్ యంత్రం కొండని తొలిచి సొరంగం ఏర్పాటు చేస్తుంది. ఈ పనిలో సుమారు 50 మంది పనిచేస్తున్నారు. వారిలో యూపీ, బిహార్‌, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 8 మంది కార్మికులు సొరంగం కప్పు కూలినప్పుడు లోపల చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయ చర్యలు జోరుగా సాగుతున్నాయి. 

అయితే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎప్పటిలాగే ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి ఆపాదించి వారే దోషులన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరం. 

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయని, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ గోడలు పగుళ్ళు ఏర్పడ్డాయని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు చూపించి విమర్శిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌ ఆగ్రహం, అసహనంతో ఊగిపోతుంటారు. 

కానీ ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు కప్పు కూలిపోతే సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులే దానికి బాధ్యులు అంటూ విమర్శించడానికి క్షణం ఆలోచించలేదు. 

ఇటువంటి నీచ రాజకీయాల కారణంగా ప్రజలు తమని తిరస్కరించారని కేటీఆర్‌ ఇంకా గ్రహించిన్నట్లు లేదని ఆయన మాటలు, పోస్టులు చూస్తే అర్దమవుతోంది.


Related Post