కేసీఆర్‌ చిలక జోస్యం... అవసరమా?

February 20, 2025


img

నిన్న తెలంగాణ భవన్‌లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రాఫ్ ఇంత త్వరగా పడిపోతుందని అనుకోలేదు. ఏడాది పాలనతోనే ప్రజలు విసుగెత్తిపోయి మళ్ళీ మనవైపు చూస్తున్నారు. 

కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయక తప్పదు. చేస్తే ఉప ఎన్నికలు జరుగక తప్పదు. ఆ ఉప ఎన్నికలలో 10కి 10 సీట్లు మనమే గెలుచుకుంటాము. కనుక ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలి,” అని అన్నారు. 

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని ఫిరాయించుకుంది. వారిలో ఎంతమందిపై అనర్హత వేటు పడిందో, ఆ కారణంగా ఉప ఎన్నికలు జరిగాయో లేదో బిఆర్ఎస్ పార్టీ నేతలందరికీ తెలుసు. 

రాజ్యాంగం ప్రకారం శాసనసభ, పార్లమెంట్ అంతర్గత వ్యవహారాలలో, ముఖ్యంగా స్పీకర్‌ నిర్ణయాధికారాల విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు. కానీ పిటిషన్లు దాఖలైతే న్యాయస్థానాలు వాటిని విచారణకు స్వీకరిస్తాయి. అవసరమైతే నోటీసులు పంపిస్తాయి. విచారణ జరిపి స్పీకర్‌కి తగు నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచిస్తాయి తప్ప కేసీఆర్‌ కోరుకున్నట్లుగా అనర్హత వేటు వేసేయలేవు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇలాగే చేసింది. కనుకనే బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడా ఇంచుమించు ఇలాగే జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్‌కి ఈవిషయం తెలియదని అనుకోలేము.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించగానే, సుప్రీంకోర్టు వారిపై అనర్హత వేటు వేస్తుందని లేదా స్పీకర్‌ వారి చేత రాజినామాలు చేయించేస్తారని, ఉప ఎన్నికలు జరుగుతాయని, వాటిలో 10కి 10 సీట్లు మనమే గెలుచుకుంటామన్నట్లు కేసీఆర్‌ మాట్లాడటం పార్టీ నేతలను మభ్యపెట్టడమే లేదా ఢీలా పడిన వారిలో నూతనోత్సాహం నింపేందుకు కావచ్చు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత ఎప్పుడు రాజీనామాలు చేయించాలనేది సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అంతా అనుకూలంగా ఉందనిపించినప్పుడు ఒకేసారి లేదా కొంతమంది చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళవచ్చు. 

ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది కనుక కేసీఆర్‌ కోరుకున్నట్లు ఉప ఎన్నికలు జరుగవు. 

అయినా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలుస్తామని జోస్యం చెపితే ఫలించిందా? కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపిలు అధికారంలోకి రాలేవని జోస్యం చెపితే ఫలించిందా?జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి అవుతానని చెప్పుకున్నారు. అయ్యారా?

ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉప ఎన్నికలు జరుగుతాయని, వాటిలో మనమే గెలుస్తామని కేసీఆర్‌ ఇలా జోస్యం చెప్పి నవ్వుల పాలవడం అవసరమా?


Related Post