ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపి 70స్థానాలకు 51 గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది. కనుక తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా బీజేపి శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ బీజేపి విజయంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఢిల్లీలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వచ్చింది కనుక మరింత వేగంగా ఢిల్లీ అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనలో అవినీతి, అసమర్దత తప్ప అభివృద్ధి జరగడంలేదన్నారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర బీజేపి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి, కీలకమైన బొగ్గుశాఖ మంత్రిగా కూడా చేస్తున్నారు. ఆ బాధ్యతలతో తీరికలేకపోవడం వలన తెలంగాణలో బీజేపికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని, కనుక తన స్థానంలో వేరొకరిని తెలంగాణ బీజేపి అధ్యక్షుడుగా నియమించాలని కోరుతున్నారు.
బీజేపి చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది కనుక ఇప్పుడు తెలంగాణ బీజేపికి మళ్ళీ బండి సంజయ్‌ని అధ్యక్షుడుగా నియమించవచ్చని సమాచారం. గతంలో ఆయన బీజేపి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అలుపెరుగని తన పోరాటాలతో కేసీఆర్‌ని ఉక్కిరిబిక్కిరి చేశారు.
అప్పుడు కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే ప్రయత్నంలో పార్టీ పేరు మార్చుకొని, ప్రధాని మోడీపై కత్తులు దూసి మొదటికే మోసపోయారు.
బీజేపికి దక్కాల్సిన ఈ అవకాశాన్ని రేవంత్ రెడ్డి తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీని ఎలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. కనుక తెలంగాణ బీజేపిని మళ్ళీ బలోపేతం చేసేందుకు బండి సంజయ్‌కి పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని తెలుస్తోంది.