రాజకీయాలంటే పార్టీల మద్య సాగాలి కానీ ఇప్పుడవి వ్యక్తిగత స్థాయికి వచ్చేశాయి. కనుక రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సమయంలో వాటికి బలవుతూనే ఉన్నారు. ఇందుకు తాజా నిదర్శనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదు అయిన కేసు గురించి చెప్పుకోవచ్చు.
గత ఏడాది జూలై 26న ఆయన తన పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్ళినప్పుడు, డ్రోన్ కెమెరాతో బ్యారేజీ వీడియో చిత్రీకరించారు. అనుమతి తీసుకోకుండా వీడియో చిత్రీకరించారంటూ మేడిగడ్డ బ్యారేజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు కేటీఆర్, ఆయన వెంట వెళ్ళిన గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్‌లపై కేసు నమోదు చేశారు.
ఈ తప్పుడు కేసుని కొట్టేయాలని కోరుతూ వారు ముగ్గురూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్, భూపాలపల్లి కోర్టులో విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఈ నెల 12 వరకు వారు ముగ్గయిరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశించింది.
తమ ప్రభుత్వ హయంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోయిందని, దెబ్బ తిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది కనుక కేటీఆర్ తన పార్టీ నేతలతో కలిసి దానిని పరిశీలించాలని వస్తే, వారికి దానిని చూపించి, జరిగిన నష్టాన్ని వివరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించి ఉంటే చాలా హుందాగా ఉండేది.
కానీ మేడిగడ్డ బ్యారేజ్‌ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారంటూ కేసు పెట్టించింది. ఒకవేళ ఆయన ఏ ఉగ్రవాదో అయ్యుంటే కేసు పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కూడా. గత ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించి, తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కేటీఆర్‌పై ఇటువంటి చిన్న చిన్న కారణాలతో కేసు నమోదు చేస్తే ప్రజలు హర్షిస్తారా? ఆలోచించుకుంటే బాగుంటుంది.