కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్నకి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కులగణన సర్వే నివేదికని వ్యతిరేకిస్తూ దాని కాపీని తగులబెట్టినందుకు వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది. ఇటీవల వరంగల్ బీసీ సభలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశయించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరింది.
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలో బీసీల సంఖ్య 40 లక్షలు తగ్గించి చూపిందని, ఇది బీసీలను మోసం చేయడమే అని తీన్‌మార్ మల్లన్న తమ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇటీవల సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి అగ్రకులాల చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా సిఎం రేవంత్ రెడ్డి, పార్టీలో రెడ్డి సామాజిక వర్గంపై తీన్‌మార్ మల్లన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కనుక వీటన్నిటికీ సంతృప్తికరమైన సంజాయిషీ ఇవ్వాలని లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసి వస్తుందని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
తీన్‌మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు నచ్చడంలేదని ఆయన మాటలతోనే స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అతనిని ఇంక ఎంత మాత్రం భరించే పరిస్థితిలో లేదు. కనుక షోకాజ్ నోటీస్ అందుకున్న తీన్‌మార్ మల్లన్న మరోసారి సిఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడటం, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడటం ఖాయమే అని భావించవచ్చు.