సిఎం రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ సూటి ప్రశ్న

February 04, 2025


img

సమగ్ర కుటుంబ సర్వే నివేదికపై చర్చించేందుకు ఈరోజు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఎప్పటిలాగే దీనిపై అధికార ప్రతిపక్షాల మద్య వాడి వేడిగా వాదోపవాదాలు సాగాయి. మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, “గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేయించింది కానీ దానిని శాసనసభలో ప్రవేశపెట్టలేదని మీరు వాదిస్తున్నారు. 

దాని కంటే మరింత ఖచ్చితంగా సర్వే చేయించామని మీరు చెప్పుకుంటున్నారు. బిఆర్ఎస్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టకపోవడం తప్పే. కానీ మీ ప్రభుత్వం మాత్రం ఏం  చేస్తోందిప్పుడు? శాసనసభలో నివేదిక ప్రవేశపెట్టామని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి దాని ఆధారంగా నివేదికపై చర్చ మొదలుపెట్టారు. శాసనసభ్యులు ఎవరూ మీ నివేదికని చూడకుండా దాని గురించి ఏం మాట్లాడాలి?

అసలు శాసనసభకు మీ నివేదికని సమర్పించకుండా ఎందుకు దాచి పెడుతున్నారు? దానిలో మీరు ఏం దాచి ఉంచాలనుకుంటున్నారు? ఆ నివేదికని సభ్యులందరికీ ఇస్తే దానిని అధ్యయనం చేసి దానిలో తప్పొప్పులను, మంచి చెడులని విశ్లేషించి చెప్పగలుగుతాము. 

అప్పుడే ఎవరైనా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు కదా? నివేదికని దాచి పెట్టి చర్చిస్తామంటే ఎలా? కనుక ఆ నివేదిక కాపీలని శాసనసభ్యులందరికీ ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పార్టీలకు అతీతంగా సభ్యులు అందరూ నా ఈ సూచనకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను,” అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. 

అక్బరుద్దీన్ సూచన చాలా సహేతుకంగా ఉంది. కానీ ఈ నివేదికలో ఏవైనా లోటుపాట్లు ఉంటే అప్పుడు ప్రతిపక్షాలు వాటిని ఎత్తి చూపిస్తూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాయి. అది కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికారంగా మారుతుంది. 

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాల కోసమే ఈ సర్వే చేయించిందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. కనుక ఈ నివేదికలో వివరాలు ప్రతిపక్షాలకు తెలిసిపోతే అవి కూడా ఈ నివేదికని తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటాయి. బహుశః అందుకే బ్రహ్మాస్త్రం వంటి ఈ నివేదికని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల చేతికి ఇవ్వకుండా జాగ్రత్తపడుతోందేమో?



Related Post