ఎఫ్-1 రేసింగ్: కేటీఆరే ఒప్పేసుకున్నారు కదా?

January 11, 2025


img

ఎఫ్-1 రేసింగ్ కేసులో శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరైన హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి తాను మాజీ మంత్రి కేటీఆర్‌, హెచ్ఎండీఏ మాజీ ఇన్‌ ఛార్జ్ కమీషనర్ అర్వింద్‌ కుమార్‌ ఆదేశాల మేరకే రెండు విడతలలో రూ.45. 71 కోట్లు ఈ-ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కి విడుదల చేశానని చెప్పిన్నట్లు తెలుస్తోంది.

నిధులు బదిలీ, నిబందనల గురించి వారిరువురి స్థాయిలోనే చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్నారని, కనుక ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఓ అధికారిగాగా కేవలం వారి ఆదేశాలు అమలు చేశానని బీఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది. 

అంతకు ముందు ఏసీబీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా ‘నిధుల విడుదలకు నేనే ఆదేశం జారీ చేశాను,’ అని చాలా స్పష్టంగా చెప్పారు. మీడియాతో కూడా ‘డబ్బు పంపానని నేనే చెపుతున్నాను కదా? ఇంక అవినీతి ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు. 

ఈ కేసులో బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి కలిగించే ‘ఎలక్టోరల్ బాండ్స్’ వ్యవహారం కూడా ఉంది. కనుక అవినీతి జరిగిందా లేదా అనేది విచారణలో తేలుతుంది. కానీ విదేశాలకు బ్రిటన్ పౌండ్ల రూపంలో నిధులు బదలాయింపు జరిగిందని కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్‌, బీఎల్ఎన్ రెడ్డి ముగ్గురూ కూడా ఒప్పుకుంటున్నారు.

ఈ బదలాయింపు నిబందనలకు విరుద్దమని ఏసీబీ,ఈడీ చెపుతున్నాయి. కనుక కేటీఆర్‌ దీనిని లొట్టిపీసు కేసు అని ఎంత తేలికగా కొట్టి పడేసినా, ఇది వారి ముగ్గురి మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.  



Related Post