సిఎం సమావేశానికి చిరంజీవి దూరం: జగన్‌ ఎఫెక్ట్?

December 26, 2024


img


ఈరోజు సిఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ పెద్దల కీలక సమావేశానికి చిరంజీవి, ప్రభాస్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ వంటి పెద్ద హీరోలు హాజరు కాలేదు. 

సాధారణంగా ముఖ్యమంత్రితో సమావేశం అంటే ప్రతీ ఒక్కరూ పాల్గోవలనే కోరుకుంటారు. కానీ సినిమా షూటింగ్‌లు లేదా విదేశాలలో ఉండటం వలన హాజరు కాలేకపోవచ్చు. సినీ పరిశ్రమలో సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ప్రముఖులు అందరూ సమావేశానికి వెళ్ళారు కనుక పెద్ద హీరోలు హాజరుకాకపోయినా ఇబ్బంది ఉండదు. 

కానీ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా భావిస్తున్న చిరంజీవి హైదరాబాద్‌లోనే ఉన్నా సిఎంతో సమావేశానికి హాజరు కాకపోవడానికి ఒకటే కారణం కనిపిస్తోంది. ఇదివరకు ఇలాగే సినీ ప్రముఖులను వెంటబెట్టుకొని అప్పటి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురైన పరాభవమే ఇందుకు కారణం అయ్యుండవచ్చు. 

ఆ రోజు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి జగన్‌తో చర్చించి, టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు వెళ్ళినప్పుడు జగన్‌ వారిపట్ల చాలా అవమానకరంగా వ్యవహరించారు. పైగా చిరంజీవి చేతులు జోడించి ఆర్ధిస్తున్న వీడియోని మీడియాకు లీక్ చేశారు.

జగన్‌తో వారు సమావేశానికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ తమ కార్లని రోడ్డుపై నిలిపివేసి నడుచుకుంటూ వచ్చేలా చేశారు. ఆనాడు జరిగిన అవమానాలను దృష్టిలో పెట్టుకునే చిరంజీవి తదితరులు నేడు సిఎం రేవంత్ రెడ్డితో సమావేశానికి హాజరుకాలేదేమో? అనే సందేహం కలుగుతుంది. 

సిఎం రేవంత్ రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత దిల్‌రాజుతో సహా ఎవరి మొహంలో సంతోషం కనబడలేదు. “సంక్రాంతికి బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్స్ పెంచుకోవడం ముఖ్యం కాదు. సిఎంగారు మాకు అంతకంటే పెద్ద టాస్క్.. తెలుగు సినిమాకి, హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు కలిగేలా చేయాలని సూచించారని” దిల్‌రాజు సర్ధి చెప్పుకోవడం చూస్తే ‘అయ్యో పాపం’ అనిపించక మానదు. 

శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు, అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆయనకు కౌంటర్ ఇవ్వడంతో ఈ సమావేశం ఈవిదంగానే ముగుస్తుందని చిరంజీవి తదితరులు ఊహించి ఉండవచ్చు. బహుశః అందుకే డుమ్మా కొట్టి ఉండొచ్చు. సమావేశానికి వెళ్ళి వచ్చిన వారి మొహాలు చూస్తున్నప్పుడు చిరంజీవి తదితరులు డుమ్మా కొట్టడం మంచిదే అనిపిస్తుంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/VjhCi8Tjj6U?si=lM7LO63izPntWlH1" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

(video courtecy: TV9 Telugu)



Related Post