చిక్కు ముడులు పడుతున్న అల్లు అర్జున్‌ కేసు

December 24, 2024


img

సంధ్య థియేటర్‌ ఘటనపై విచారణ జరుపుతున్న చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్‌కి నోటీస్ పంపారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావలసిందిగా నోటీసులో పేర్కొన్నారు. 

ఈ వ్యవహారం మెల్లగా చల్లబడుతుందని అనుకుంటే మరింత బిగుసుకుంటోంది. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్‌ జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యావత్ సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూకట్టడంతో సహజంగానే ప్రభుత్వ పెద్దలకు అసహనం కలిగించింది. శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఆ అసహనం స్పష్టంగా కనిపించింది. 

అప్పుడు అల్లు అర్జున్‌ కూడా ‘తగ్గేదేలే’ అన్నట్లు ప్రెస్‌మీట్‌ పెట్టి కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇంకా తీవ్రంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ మంత్రులు, నేతలు అల్లు అర్జున్‌పై ఎదురుదాడి చేశారు. డీజీపీ జితేంద్ర, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ సైతం అల్లు అర్జున్‌ ధోరణిని తప్పు పట్టారు. సీపీ సీవీ ఆనంద్ అయితే ప్రెస్‌మీట్‌ పెట్టి సంధ్య థియేటర్‌లో నుంచి అల్లు అర్జున్‌ని బయటకు తీసుకువచ్చిన వీడియోని రిలీజ్ చేశారు.

సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రివిలేజ్, బెనిఫిట్ షోలకు, టికెట్స్ రేట్ల పెంపుకు అనుమతించబోమని సిఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడంతో సినీ పరిశ్రమ కంగు తింది. 

ఇప్పుడు ఇందుకు అల్లు అర్జున్‌ని నిందించాలా లేక ఆయనకు సంఘీభావం తెలిపి ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించి ఈ నష్టం కలిగించుకునందుకు తమని తాము నిందించుకోవాలో సినీ పరిశ్రమకు తెలీని పరిస్థితి నెలకొంది. అందుకే అల్లు అర్జున్‌కి సంఘీభావం తెలిపిన సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఆయన ప్రెస్‌మీట్‌ తర్వాత మాట్లాడలేదు. ఆయన ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసినా ఎవరూ ఖండించలేదు. 

సినీ పరిశ్రమ దూరంగా ఉండిపోవడంతో అల్లు అర్జున్‌ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిలో ఆయన నేడు మరో మాట మాట్లాడకుండా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరుకాక తప్పదు. మళ్ళీ కవరేజ్ కోసం మీడియా, అల్లు అర్జున్‌ని చూసేందుకు అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుంటుంటారు. కనుక మళ్ళీ అక్కడ కొత్తగా ఏం జరుగబోతోందో?  


Related Post