ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్క్ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యింది. రేపు (గురువారం) జిల్లా మంత్రులు దీనికి ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో వ్యవసాయోత్పత్తులను ప్రాసెసింగ్ చేసేందుకు వీలుగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల కోసం 2008లో ఈ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం.
ఆ తర్వాత వివిద కారణాల చేత ఈ మెగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ళ తర్వాత కేసీఆర్ హయాంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కానీ కేసీఆర్ హయాంలో ఈ మెగా ఫుడ్ పార్క్ పనులు పూర్తికాకపోవడంతో, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రులు చొరవ తీసుకొని శరవేగంగా మిగిలిన పనులు పూర్తి చేయించారు.
ఈ మెగా ఫుడ్ పార్కులో రూ.109 కోట్లు వ్యయంతో రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్, నీళ్ళు, విద్యుత్ ఉప కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, పరిపాలన భవనాలు వగైరా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సిద్దం చేశారు.
దీనిలో కొన్ని పరిశ్రమలు కూరగాయలు, డ్రైఫ్రూట్స్ ప్రాసెసింగ్ కంపెనీలు స్థాపించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. మెగా ఫుడ్ పార్కులో 85.85 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు, 56.01 ఎకరాలు సూక్ష్మ, చిన్న మద్యతరహా పరిశ్రమలకు కేటాయించారు. దీనిలోనే గిరిజన అభ్యుదయ సమితికి రైస్ మిల్లింగ్ మరియు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది.
ఈ మెగా ఫుడ్ పార్కులో ఏర్పాటు కాబోయే పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 15,000 మందికి ఉపాధి లభించనున్నాయి.