మాజీ మంత్రి హరీష్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఓ కేసు నమోదైంది. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఆయనపై పిర్యాదు చేశారు.
హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీ రాధాకిషన్ రావు ఇద్దరూ కలిసి తనను చాలా వేధించారని, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చక్రధర్ పిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన పిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఐటి చట్టంలోని సెక్షన్స్ 120 (బి), 386, 409, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.
కనుక నేడో రేపో హరీష్ రావు, రాధాకిషన్ రావులకి పోలీసులు నోటీసులు పంపించనున్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబందం ఉందని భావిస్తున్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లని ఇప్పటికే జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రశ్నించారు. ఇప్పుడు హరీష్ రావుపై కేసు నమోదవడంతో ఈ కేసు విచారణ వేగవంతం కాబోతోందని భావించవచ్చు. ఈ కేసులో మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తనని అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చే ఆలోచన విరమించుకున్నారు. ఇటీవలే ఆయన అమెరికా ప్రభుత్వానికి తనను రాజకీయ శరణార్ధిగా ఆశ్రయం కల్పించమని అభ్యర్ధిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణ వేగవంత చేయాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. అందుకే హరీష్ రావుతో ప్రారంభించి ఉండవచ్చు. కనుక తర్వాత ఎవరో?