ఈ నెల 9న సచివాలయ ఆవరణలో సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నారు. దీని కోసం జోరుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విగ్రహం కూడా తయారైపోయింది.
అయితే ఈ విగ్రహం ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలాగే ఉంటుందా లేక చాకలి ఐలమ్మ రూపురేఖలతో సిఎం రేవంత్ రెడ్డి డిజైన్ చేయించిన విగ్రహం ఉంటుందా? అనే విషయం ఇంతవరకు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. కనుక డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలు ఏవిదంగా ఉంటాయో అందరికీ తెలుస్తుంది.
అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్పించాలని సిఎం రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు, దానిపై ప్రజాభిప్రాయం కనీసం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలి కదా? కానీ తన నలుగురు మంత్రులు సీతక్క, కొండా సురేఖా, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డిలతో మాత్రం కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు.
రాజముద్ర, రాష్ట్ర గీతం గురించి చర్చించి తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏం నిర్ణయం తీసుకుందో ఎందుకు బయటపెట్టలేదు? ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చితే, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన విగ్రహాల పరిస్థితి ఏమిటి? అని బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలుచేయలేక ఇలాంటి నిర్ణయాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏడాది కాలం దొర్లించేశారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.