రాజకీయాలకు సెలవు: కేటీఆర్‌

November 30, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌ ఈరోజు ఉదయం ఓ ట్వీట్ చేశారు. కొన్ని రోజులు రాజకీయాల నుంచి సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుంటానని, ప్రత్యర్ధులు తనను ‘మిస్’ అవుతారేమో? అని ట్వీట్ చేశారు. 

రాజకీయ నాయకులు కుటుంబాలతో కలిసి విదేశాలలో హాయిగా గడిపి తిరిగి వస్తుండటం సర్వసాధారణమే. అయితే ‘సెలవు’ అని చెప్పుకుంటే ప్రత్యర్ధులు, మీడియా విపరీతార్ధాలు తీస్తారని విదేశాలకు వెళ్ళి వస్తున్నామని చెపుతారు.  

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దాదాపు 10 నెలలుగా ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. కనుక కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరే పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలో మళ్ళీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలవవచ్చని రెండు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన ప్రాయంగా చెప్పారు. 

ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కేటీఆర్‌ హటాత్తుగా పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉండబోతుండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. గవర్నర్ అనుమతి లభించగానే అరెస్ట్ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెపుతుండటం. బహుశః గవర్నర్ అనుమతి లభించి ఉండవచ్చు. 

2. ఇటీవల కల్వకుంట్ల కవిత మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవడం. కేటీఆర్‌ పనితీరు పట్ల కేసీఆర్‌ అసంతృప్తిగా ఉన్నందునే ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న కల్వకుంట్ల కవితని యాక్టివ్ చేయించారని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. కనుక పార్టీ విషయంలో తండ్రితో మనస్పర్ధలు ఏర్పడటంతో కేటీఆర్‌ సెలవు తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

3. ప్రస్తుతం కాంగ్రెస్‌-బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు నిలకడగా సాగుతున్నందున, విదేశాలలో కాస్త సేద తీరి వచ్చేందుకు ఇదే తగిన సమయమని కేటీఆర్‌ భావించి ఉండొచ్చు. 


Related Post