ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి శుక్రవారం కాకినాడ పోర్టులో పర్యటించి అక్కడి నుంచి అక్రమంగా స్టెల్లా అనే ఓడలో ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా అనేక దిగ్బ్రాంతి కలిగించే విషయాలు పవన్ కళ్యాణ్ స్వయంగా బయటపెట్టారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా నిత్యం వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుండటమే చాలా విచిత్రం అనుకుంటే, తాను పోర్టుకి వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అవుతాయని మెసేజులు పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఈ బియ్యం అక్రమ రవాణాలో మొత్తం పోర్టులో పనిచేస్తున్న వారందరూ ఉన్నారని స్పష్టమైంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రినైన తనకే పోర్టు అధికారులు సహకరించకుండా ముప్పతిప్పలు పెట్టడం చూసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ లెక్కన కాకినాడ పోర్టు పెద్ద మాఫియా డెన్‌లా మారిందని అర్దమవుతోంది.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు యధేచ్చగా రేషన్ బియ్యం ఎగుమతి చేయగలుగుతున్నప్పుడు గంజాయి, ఇతర నిషేదిత వస్తువులు ఎగుమతి చేయడం పెద్ద కష్టం కాదన్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాటలు నూటికి నూరు శాతం నిజమే కదా?
కాకినాడ పోర్టుకి నిత్యం అనేక భారీ నౌకలు వచ్చి వెళుతుంటాయి. నిత్యం వేలటన్నుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. కానీ పోర్టులో కేవలం 16 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉండటం, వారు కూడా తనను తనికీలు చేయకుండా అడ్డుకోవడం చూసి పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. ముంబయిలో ఉగ్రదాడి చేసిన కసబ్ తదితరులు సముద్ర మార్గంలోనే నగరంలోకి ప్రవేశించారని, కాకినాడ పోర్టు నిర్వహణ, భద్రతా సిబ్బంది ఈవిదంగా ఉన్నప్పుడు ఉగ్రవాదులు ఇటు వైపు నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించరని నమ్మకం ఏమిటని ప్రశ్నించారు.
చుట్టుపక్కల ఓఎన్‌జీసీ వంటి అనేక సంస్థలున్నాయని వాటి భద్రత, దేశ భద్రతకి కూడా పెను ప్రమాదం పొంచి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.