లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాలేదు. వరద బాధితులని పరామర్శించడానికి కూడా ఆయన బయటకు రాకపోవడంతో, ‘కేసీఆర్‌కి పదవీ, అధికారం ఇస్తేనే ప్రజలను పట్టించుకుంటారా లేకుంటే లేదా?’ అని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ వాటిని కూడా పట్టించుకోలేదు.
తాజాగా ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీసమేతంగా నవగ్రహయాగం చేస్తున్నారు. ఆ ఫోటో ఒకటి బయటకు రావడంతో కేసీఆర్ యాగం దేనికోసం?అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ జాతకాలు, వాస్తు నమ్మి పాటిస్తుంటారు. అందుకే పాత సచివాలయాన్ని కూల్చివేసి వాస్తు ప్రకారం కొత్త సచివాలయం నిర్మించుకున్నారు. అది అందుబాటులోకి వచ్చేవరకు ప్రగతి భవన్ నుంచే పాలన సాగించారు.
అలాగే రాజకీయాలలో ఎన్నికలు లేదా ఏవైనా సవాళ్ళని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు యాగాలు చేస్తుంటారు.
అయితే ఎంత జాతకాలు, వాస్తు పాటించినా, యాగాలు చేసినా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముద్దుల కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలు జైలులో గడపాల్సి వచ్చింది.
కనుక ఈ సమస్యలన్నిటి నుంచి ఉపశమనం పొంది రాజకీయంగా మళ్ళీ సానుకూల వాతావరరణం ఏర్పడేందుకు బహుశః ఈ నవగ్రహ యాగం చేస్తున్నారేమో? కానీ ఈ యాగమైనా ఆశించిన ఫలితం ఇస్తుందా లేదో చూడాలి.